అల్లు అరవింద్ ఆహా యాప్ ఇప్పుడు చాలా చిన్న సినిమాలకు ప్రాణం పోస్తోంది. ఇక రిలీజ్ కావేమో...మన ప్రతిభ ప్రపంచానికి తెలియదేమో అనుకున్న సమయంలో ఆహా ...ఆ సినిమాలు తీసుకుని రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే భానుమతి రామకృష్ణ సినిమాతో పేరు తెచ్చుకున్న ఆహా ...ఇప్పుడు మరో చిన్న సినిమా రిలీజ్ కు రంగం సిద్దం చేస్తోంది. ఆ సినిమా పేరు జోహార్. 

రాజకీయ వ్యంగ్య చిత్రంగా ‘జోహార్‌’ సినిమా రూపొందొంది. భాను సందీప్‌ మార్ని నిర్మిస్తున ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకుడు.  ఇందులో తాజా రాజకీయ, సాంఘిక పరిణామాలని ఎత్తి చూపుతూ, విగ్రహ రాజకీయ కాళ్ళ కింద నలిగిపోయిన ఐదు జీవితాల కథనాలే ఇతివృత్తంగా సాగించిన ఎమోషన్‌ డ్రామా జోహార్‌ అని తెలిచేలా డిజైన్‌ చేశారు. 

దర్శకుడు తేజ మార్ని మాట్లాడుతూ ”వర్మ గారి వద్ద వంగవీటి చిత్రానికి దర్శకత్వ శాఖలో, విజయేంద్ర ప్రసాద్‌ వద్ద రచనా విభాగంలో పనిచేశాను. దర్శకునిగా ఇది నా తొలి సినిమా. పొలిటికల్‌ సెటైర్‌గా రూపొందిస్తూ, ఐదు పాత్రల చుట్టూ కథనం జరుగుతుంది.  సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం” అని అన్నారు. 

‘దృశ్యం’ సినిమాలో వెంకటేష్‌ కుమార్తెగా నటించిన ఈస్తర్‌ అనిల్‌, వంగవీటి సినిమా ఫే నైనా గంగూలి, ఇంకా ఈశ్వరీరావు, రోహిణి, శుభ లేఖ సుధాకర్‌, చైతన్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రధారులు. వారణాసి, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్‌ ప్రాంతా ల్లో చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రియదర్శన్‌, ఛాయాగ్రహణం: జగదీశ్‌, పాటలు: చైతన్య ప్రసాద్‌.