దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ప్రకటించిన తర్వాత వర్మ చేసిన ట్వీట్‌పై బీజేపీ నేతలతో పాటుగా, ఆదివాసీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. 

దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ప్రకటించిన తర్వాత వర్మ చేసిన ట్వీట్‌పై బీజేపీ నేతలతో పాటుగా, ఆదివాసీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. ద్రౌపది ముర్మును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తాజాగా రామ్‌గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఆదివాసీలు ఫిర్యాదు చేశారు. ద్రౌపది ముర్మును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అసలేం జరిగిందంటే.. “ద్రౌపది ప్రెసిడెంట్ అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు ఎవరు?” అంటూ వర్మ ట్వీట్ చేశారు. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ నేత నారాయణ రెడ్డి శుక్రవారం అబిడ్స్ పోలీసు స్టేషన్‌లో ఆర్జీవీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దౌపద్రి ముర్మును కించపరిచే విధంగా వర్మ పోస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి అబిడ్స్ పోలీసులు స్పందిస్తూ.. తాము ఫిర్యాదును స్వీకరించామని చెప్పారు. దీనిపై న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటున్నామని తెలిపారు. ఆ తర్వాత ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

ఇక, నారాయణ రెడ్డి తన ఫిర్యాదులో.. వర్మ పోస్టులు అత్యంత అవమానకరంగా ఉన్నాయని.. సీనియర్ గిరిజన మహిళా రాజకీయ నాయకురాలిని అవమానించారని పేర్కొన్నారు. పోలీసులు ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని, వర్మను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా వర్మపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

ఈ క్రమంలోనే తాను చేసిన ట్వీట్‌పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వ్యంగ్యంగా పోల్చడానికి ట్వీట్ చేశానే తప్ప మరో ఉద్దేశం లేదని వర్మ చెప్పుకొచ్చారు. మహాభారతంలో ద్రౌపది పాత్ర తనకెంతో ఇష్టమని తెలిపారు. ఆ క్యారెక్టర్‌ను గుర్తు చేయాలనే ట్వీట్‌ చేసినట్లు పేర్కొన్నారు. అంతేతప్ప ఎవరి మనోభావాలను దెబ్బ తీసే ఉద్దేశ్యం తనకు లేదని అన్నారు.