క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌రూపం దాలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ వైరస్ ని ఎలా క‌ట్ట‌డి చేయాలో తెలియ‌క ప్రపంచ వ్యాప్తంగా ప్ర‌భుత్వాలు ఆందోళ‌న‌కి గుర‌వుతున్నాయి. దాని నుంచి తప్పించుకునే ఒకే ఒక ఉపాయం...సామాజిక దూరం పాటించటం. అలా చేస్తే కరోనా బారిన ప‌డ‌కుండా ఉంటామ‌ని ప్ర‌భుత్వాలు గొంతెత్తి చెబుతున్నాయి. కానీ, ప్ర‌జ‌లు మాత్రం య‌దేచ్చ‌గా రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. సెల‌బ్రిటీలు కూడా వారిలో అవ‌గాహాన పెంచే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ప్ప‌టికీ, కొంద‌రు మార‌డం లేదు. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై స్పందించిన వ‌డివేలు క‌న్నీరు పెట్టుకున్నారు.

ప్రముఖ హాస్య నటుడు వడివేలు తాజాగా అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో.. ‘చాలా మనోవేదనకు గురవుతున్నా. ప్రభుత్వం చెప్పే మాటలను అర్థం చేసుకోండి. వారి ఉత్తర్వుల మేరకు అందరూ కొన్ని రోజులపాటు ఇళ్లలోనే ఉండండి. వైద్య ప్రపంచమే భయాందోళనకు గురవుతోంది. వైద్యులు, నర్సులు ప్రాణాలను పనంగా పెట్టి సేవలందిస్తున్నారు. దయచేసి అందరూ సహకరించండి. ఎవరూ బయటకు రాకండి. పోలీసులు కూడా మిమ్మల్ని బతిమలాడటాన్ని చూస్తున్నా. బిడ్డాపాపలతో హాయిగా ఇంట్లోనే ఉందాం. ఎవరూ తేలికగా తీసుకోకండి’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎప్పుడూ నవ్వించే ఆయన ఇలా కన్నీళ్లతో సందేశమిస్తుండటం అందరినీ ఆలోచింపజేస్తోంది.

ఇక అన్ని చోట్లా కరోనా వైరస్‌ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి పలువురు సినీ తారలు అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిస్థితులను చూసి కొందరు హీరోలు, హీరోయిన్స్ మళ్లీ మళ్లీ అవగాహన కల్పిస్తున్నారు. అయినా కొందరు మారడం లేదంటూ వీడియోల ద్వారా సందేశాన్ని పంపిస్తున్నారు.