కంగనా రనౌత్ మరియు మహారాష్ట్ర సర్కార్ మధ్య వాడివేడిగా యుద్ధం నడుస్తుంది. ఇటీవల కంగనా రనౌత్ బాలీవుడ్ పై చేసిన డ్రగ్ ఆరోపణలు సంచలనంగా మారాయి. సుశాంత్ డెత్ కేసుతో మొదలై చిలికి చిలికి గాలివానగా మారింది. వ్యక్తుల నుండి వ్యవస్థలకు, వ్యవస్థల నుండి ప్రభుత్వాల వరకు ఈ వివాదం పాకింది. ఇక శివ సేన నేతలకు కంగనాకు మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ముంబైలోని కంగనా ఆఫీస్ ని మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో వివాదం మరింత రాజుకుంది. ఇక ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పై సవాళ్లు విసురుతున్న కంగనా రనౌత్ కి కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు. దీనిని విపక్షాలతో పాటు శివసేన ప్రభుత్వం కూడా తప్పుబట్టింది. 

తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ విషయాన్ని విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా కంగనా మరియు బీజేపీ గవర్నమెంట్ పై ఆయన విమర్శల దాడికి దిగారు. లాక్ డౌన్ సమయంలో ఉపాధిలేక రోడ్లపై వేల మైళ్ళు నడుస్తూ వెళుతున్న వలసకూలీల ఫోటోలు ఒకవైపు, వై ప్లస్ కేటగిరీ భద్రత మధ్య దర్జాగా నడిచి వెళుతున్న కంగనా ఫోటో మరో వైపు ఉంచి 'ఇదే నేటి భారతం' అని సెటైర్ వేశారు. వలస కూలీల కన్నీటి గాథలు పట్టని ప్రభుత్వానికి రాజకీయం కోసం ఒకరికి మద్దతు ఇస్తున్నారన్నట్లు ఆయన కామెంట్ ఉంది. 

అలాగే కంగనా వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ 'ఒక చిత్రం చేసి కంగనా తను రాణి లక్ష్మీ భాయ్ అనుకుంటే...దీపిక పదుకొనె పద్మావతి, హ్రితిక్ రోషన్ అక్బర్, షారుక్ ఖాన్ అశోక చక్రవర్తి అవుతారు' అని మరో సెటైర్ కూడా ప్రకాష్ రాజ్ వేయడం జరిగింది. సుశాంత్ డెత్ కేసును బీజేపీ రాజకీయం కోసం వాడుకుంటుందని తీవ్ర ఆరోపణలు తలెత్తుతుండగా, కంగనా కూడా బీజేపీ కోసం పని చేస్తుందని పలువురు అంటున్నారు. మొదటి నుండి బీజేపీ మరియు మోడీ విధానాలను వ్యతిరేకించే ప్రకాష్ రాజ్ మోడీ మరియు కంగనాలను ఉద్దేశిస్తూ ఈ సెటైరికల్ పోస్ట్ లు పెట్టారు.