2020 చిత్ర పరిశ్రమకు విషాదాల సంవత్సరంగా మారిపోయింది. అనేక పరిశ్రమలకు చెందిన నటులు పదుల సంఖ్యలో ఈ ఏడాది మరణించడం జరిగింది. కొందరు ఆత్మహత్య చేసుకోగా, మరికొందరు అనారోగ్యంతో, మరికొందరు హఠాన్మరణం పొందారు. బాలీవుడ్ లో రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ మరియు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించడం జరిగింది. కన్నడ పరిశ్రమకు చెందిన హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో మరణించారు. ఇక మన పరిశ్రమకు చెందిన నటుడు జయప్రకాశ్ రెడ్డి కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈ ఏడాది చనిపోయిన ప్రముఖులలో వీరు కొందరు మాత్రమే. 

కాగా మలయాళ పరిశ్రమకు చెందిన నటుడు ప్రబీస్ తుది శ్వాస విడిచారు. 44ఏళ్ల ఈ మలయాళీ నటుడు మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ షూటింగ్ సెట్స్ లోనే కుప్పగూలిపోవడం జరిగింది. ఓ సామాజిక అవగాహన చిత్రం కోసం షూటింగ్ జరుగుతుండగా అందులో ప్రబీష్ పాల్గొన్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ప్రబీష్ ఒక్కసారిగా క్రిందపడిపోవడంతో పాటు అపస్మారక స్థితిలోకి వెళ్లారట. దీనితో ఆయనను కొచ్చి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. 

ప్రబీష్ అనేక టెలీఫిల్మ్స్ తో పాటు సినిమాలలో నటించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అనేక మంది నటులకు తన గొంతు అరువు ఇచ్చారు. ప్రబీష్ భార్య ఝాన్సీ, కూతురు తాన్యాలతో ఉంటున్నారు. ప్రబీష్ మరణం మలయాళ పరిశ్రమలో విషాదం నింపింది. విషయం తెలుసుకున్న చిత్ర ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.