నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ ఇన్వెస్టిగేషన్ తో మొదలైన డ్రగ్స్ కేసు కొనసాగుతుంది. ఇప్పటికే డ్రగ్స్ ఆరోపణలు బాలీవుడ్ లో ప్రకంపనలు రేపగా, తాజాగా నటుడు అజాజ్ ఖాన్ అరెస్ట్ సంచలనంగా మారింది. నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ అజాజ్ ఖాన్ నిన్న రాజస్థాన్  నుండి ముంబై వస్తుండగా ఎయిర్ పోర్ట్ లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నేడు అజాజ్ ఖాన్ ని ఎన్ సి బి అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. 

అంధేరి,  లోఖండ్వాలా ప్రాంతాల్లో గల అజాజ్ ఖాన్ నివాసాలలో అధికారులు తనిఖీలు నిర్వహించగా నిషేధిత ఉత్ప్రేరకాలు లభించినట్లు అధికారులు తెలిపారు. అలాగే డ్రగ్ పెడ్లర్ షాదాద్ ఫారూఖీ షేక్ తో అజాజ్ ఖాన్ కి సంబంధాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. గత గురువారం షాదాద్ ఫారూఖీని అరెస్ట్ చేయడం జరిగింది.

కాగా డ్రగ్స్ ఆరోపణలపై సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి మరియు ఆమె తమ్ముడు షోవిక్ చక్రవర్తిలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ మరియు శ్రద్దా కపూర్ లను అధికారులు విచారించడం జరిగింది. దర్శక నిర్మాత కరణ్ జోహార్ కి సైతం అధికారులు విచారణకు రావాలని నోటీసులు పంపారు.