సాండల్‌వుడ్‌లో వరుసగా ప్రముఖులు కరోనా బారిన పడుతున్న వార్తలు కలవరపెడుతున్నాయి. సీనియర్‌ నటి, ఎంపీ సుమలత, యంగ్ హీరో ధృవ సర్జ, అతని భార్య కరోనా బారిన పడటం తెలిసిందే. ఆ తరువాత స్టార్ హీరో, యాక్షన్‌ కింగ్ అర్జున్‌ కూతురు కూడా తనకు కరోనా సోకినట్టుగా ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఈ మేరకు తన సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేసిన ఐశ్వర్య అర్జున్‌, తనతో కాంటాక్ట్ అయిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకున్న ఐశ్వర్య అర్జున్‌, కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్ట్ చేశారు. `నా శ్రేయోభిలాషులందరికీ... నీ మీ అందరికీ తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే.. దేవుడి దయతో నాకు కరోనా నెగెటివ్ వచ్చింది. నా గురించి ఆలోచించి, ప్రార్థన చేసిన వారందరికీ కృతజ్ఞతలు. ఈ విపత్తు ఇంకా ముగిసి పోలేదు. అందరూ జాగ్రత్తగా ఉండండి` అంటూ పోస్ట్ చేసింది ఐశ్వర్య.

సీనియర్‌ నటి సుమలత కూడా తాను కరోనా నుంచి కోలుకున్నట్టుగా ఇటీవల ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సినిమా షూటింగ్‌లు ప్రారంభం కాకపోవటంతో సినీ తారలు కరోనా భారీన పడకపోయినా సీరియల్‌ తారలు మాత్రం పెద్ద సంఖ్యలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే లీడింగ్‌ సీరియల్స్‌ నటులకు కరోనా సోకినట్టుగా నిర్థారణ అయ్యింది.