చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మలయాళ నటుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తుంది.

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. తాజాగా మరో నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవల సినీ, టీవీ నటులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకి గురి చేస్తుంది. ఒడియానటి రష్మి రేఖ ఓజా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా మలయాళ నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

నివిన్‌ పౌలీ హీరోగా నటించిన `యాక్షన్‌ హీరో బీజు` చిత్రంతో విలక్షన్‌గా నటించిన ఎన్‌డీ ప్రసాద్‌ (ND Prasad) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొచ్చిలోని కలస్సేరి ప్రాంతంలో తన ఇంట్లో ఉరేసుకుని రెండు రోజుల క్రితం(జూన్‌ 25) బలవన్మరణానికి పాల్పడ్డాడు. మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలే కారణమని ప్రాథమికంగా పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్‌డీ ప్రసాద్‌ గతంలో పలు నేరాల్లో నిందితుడుగానూ ఉన్నాడు. 

గతంలో డ్రగ్స్ తో పట్టుపడటంతోపాటు పలు కేసుల్లో అభియోగాలు ఎదుర్కొన్నాడు. అలాగే గతేడాది ఎర్నాకుళం ఎక్సైజ్‌ సర్కిల్‌ అధికారులు నిర్వహించిన దాడిలో 15 గ్రాముల గంజాయి, 2.5గ్రాముల హాష్‌ ఆయిల్‌, 0.1 గ్రాముల బుప్రెనార్ఫిన్‌, కొడవలితో పట్టబడినట్టు సమాచారం. దీంతోపాటు సినిమాల్లోకి రాకముందు పలు పోలీస్‌ స్టేషన్లలో ఆయనపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 

ఎన్‌డీ ప్రసాద్‌.. 2016లో నివిన్‌ పౌలీ హీరోగా నటించిన `యాక్షన్‌ హీరో బిజు` చిత్రంలో విలన్‌గా నటించారు. తనదైన స్టయిల్‌లో విలనిజం చూపించి మెప్పించారు. దీంతోపాటు `ఇబా`, `కిర్మాణి` వంటి సినిమాలు చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.