మెగాస్టార్ చిరంజీవి సినిమాకు కూడా థియేటర్లు దొరకడం లేదట. నైజాంలో ఆచార్యకు థియేటర్స్ కొరత ఏర్పడుతున్నట్లు పరిశ్రమలో జోరుగా ప్రచారం సాగుతుంది.  

ఏప్రిల్ 29న ఆచార్య (Acharya) గ్రాండ్ రిలీజ్ కానుంది. చిరంజీవి-చరణ్ కలిసి నటిస్తున్న పూర్తి స్థాయి మల్టీస్టారర్ పై మెగా ఫ్యాన్స్ లో మంచి హైప్ నెలకొంది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు మరో స్థాయికి చేరాయి. ఇక మణిశర్మ సాంగ్స్, ఆచార్య ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఆచార్య టాలీవుడ్ కి మరో సూపర్ హిట్ అందిస్తుందని చాలా మంది ఫిక్స్ అయ్యారు. అయితే ఆచార్యకు నైజాంలో థియేటర్స్ దొరకడం లేదనేది లేటెస్ట్ టాక్. 

కెజిఎఫ్ చాప్టర్ 2 (KGF Chapter 2)కారణంగా ఆచార్యకు పూర్తి స్థాయిలో థియేటర్స్ అందుబాటులోకి రావడం లేదట. కెజిఎఫ్ చాప్టర్ 2 నైజాంలో రికార్డు వసూళ్లు రాబట్టింది. పది రోజులకు రూ. 36 కోట్ల షేర్ వసూలు చేసింది. డబ్బింగ్ చిత్రాల చరిత్రలో ఇది నయా రికార్డు. ఈ మూవీ గత డబ్బింగ్ చిత్రాల రికార్డ్స్ తుడిచిపెట్టింది. ఇక రెండవ వారం కూడా కెజిఎఫ్ వసూళ్లు స్థిరంగా ఉన్నాయి. సెకండ్ వీకెండ్ మంచి వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో కెజిఎఫ్ 2 థియేటర్స్ నుండి తొలగిండం లేదు. 

కెజిఎఫ్ 2 ని నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆచార్య మూవీ డిస్ట్రిబ్యూటర్స్ గా మరొకరు ఉన్నారు. నైజాంలో గుప్తాధిపత్యం చలాయిస్తున్న దిల్ రాజు తాను డిస్ట్రిబ్యూట్ చేసిన కెజిఎఫ్ 2 తీసేసి ఆచార్యకు థియేటర్స్ ఇవ్వడం లేదని సమాచారం. ఈ కారణంగా ఆచార్యకు థియేటర్స్ సమస్య ఏర్పడుతుందట. అయితే సినిమా విడుదలకు మరో నాలుగు రోజుల సమయం ఉండగా.. ఆచార్యకు నైజాంలో థియేటర్స్ సమస్య తీరుతుందేమో చూడాలి. మారిన పరిస్థితుల రీత్యా పెద్ద చిత్రాలు భారీ ఎత్తున విడుదల చేసి, ఓపెనింగ్స్ ద్వారానే అసలు, లాభం లాగేయాలని చూస్తున్నాయి. కాబట్టి ఎన్ని ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేస్తే అంత ప్రయోజనకరం. 

ఇక ఆచార్య మూవీ నుండి కాజల్ ని తప్పించినట్లు దర్శకుడు కొరటాల శివ తెలియజేశారు. దీంతో పూజా హెగ్డే మాత్రమే కనిపించనుంది. ఆమె చరణ్ తో ఈ మూవీలో జతకడుతున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.