బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఇటీవల బోల్డ్ అండ్‌, కాంట్రవర్సీ కామెంట్ తో వివాదంలో ఇరుక్కుంటోంది. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో ఆమె నెపోటిజం, బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 95శాతం బాలీవుడ్‌ ప్రముఖులు డ్రగ్స్ తీసుకుంటారని వెల్లడించింది. 

మరోవైపు మహారాష్ట్ర సర్కార్‌పై ఆమె పలు వివాదాస్పద కామెంట్స్ చేసి వార్తల్లోకి ఎక్కింది. దీంతో బీఎంసీ ముంబయిలోని కంగనా కార్యాలయాన్ని కూల్చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ముంబయిని పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌గా పోల్చింది. అది మరింత వివాదంగా మారింది. 

కంగనా తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ఉగ్రవాదులతో పోలుస్తూ ట్వీట్‌ చేసింది. దీన్ని తప్పు పడుతూ రమేష్‌ నాయక్‌ అనే న్యాయవాది తుమకూరు జేఎంఎఫ్‌సీ కోర్ట్ లో పిటిషన్‌ దాఖలు చేశారు. 

రైతుని దేశానికి వెన్నెముకగా భావిస్తారని, ఇప్పటికీ సాగుపైనే ఎక్కువ జనాభా ఆధారపడిందన్నారు. అలాంటి రైతు కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రోడ్డిక్కితే వారిని టెర్రరిస్టులతో పోలుస్తారా? అని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

మరోవైపు కంగనా ట్వీటపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతు అంటే డ్రగ్స్ మాఫియా కాదు, నెపోటిజం లాంటిది కాదు. కంగన మిడి మిడి జ్ఞానంతో కామెంట్‌ చేయడం సరికాదు, ఆమె బాలీవుడ్‌ లో ఫైర్‌ బ్రాండేమో గానీ ఇక్కడ కాదని నెటిజన్లు, రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు.