భీష్మ చిత్ర ఘనవిజయం హీరో నితిన్ లో ఉత్సాహాన్ని నింపింది. అదే జోరుతో నితిన్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు అంటూ అభిమానులు సంబరపడ్డారు. నితిన్ బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డు పడబోతోంది అంటూ సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వినిపించాయి. తాజాగా నితిన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ యంగ్ హీరో మరికొంత కాలం బ్యాచలర్ గా ఉండాల్సిందే. 

ఇటీవల కొన్ని రోజుల క్రితం నితిన్ పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 16న నితిన్ వివాహం జరగాల్సింది ఉంది. కానీ కరోనా కారణంగా నితిన్ వివాహం వాయిదా పడబోతోంది అంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ వార్తలే నిజమయ్యాయి. 

నితిన్ తన వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు నితిన్ అభిమానులకు ఓ లేఖ విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కరోనా కారణంగా ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో మీ అందరికి తెలుసు. ఇలాంటి సమయంలో లాక్ డౌన్ కారణంగా ఎవరూ బయటకు రాకూడదు. అందువల్ల మార్చి 30న నా జన్మదిన వేడుకల్ని రద్దు చేసుకుంటున్నాను. 

అంతే కాదు.. ఏప్రిల్ 16న జరగాల్సిన నా వివాహాన్ని కూడా వాయిదా వేసుకుంటున్నాను. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి మనమందరం కలసి కట్టుగా పోరాటం చేయాలి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇంట్లోనే కాలుమీద కాలేసుకు కూర్చుని కుటుంబ సభ్యులతో గడిపితేనే దేశానికి సేవ చేసినట్లు. ఎల్ల వేళలా మీ అభిమానంతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా ఆశించే నితిన్ అని ఓ లేఖని విడుదల చేశాడు.