దర్శక ధీరుడు రాజమౌళి ఒక సినిమా చేస్తుంగానే ఆయన చేయబోయే తదుపరి చిత్రానికి సంబంధించి చర్చ మొదలవుతోందిజ. బాహుబలి చిత్రీకరణ దశలో ఉండగానే తరువాత సినిమా ఏంటి అన్ని ఎన్నో వేదికల మీద రాజమౌళిన ప్రశ్నించారు. అయితే రాజమౌళి మాత్రం అందుకు సమాధానం చెప్పుకుండా దాటవేస్తూ వచ్చాడు. చివరకు బాహుబలి రిలీజ్‌ అయిన చాలా రోజుల తరువాత ఆర్ఆర్‌ఆర్‌ను ప్రకటించాడు రాజమౌళి.
  
ప్రస్తుతం ఆర్‌ఆర్ఆర్‌ షూటింగ్ సగానికి పైగా పూర్తయిన నేపథ్యంలో నెక్ట్స్ సినిమా ఏంటన్న చర్చ మొదలైంది. అయితే చర్యకు తాజాగా ఓ ఇంటర్య్వూలో ఫుల్‌ స్టాప్‌ పెట్టాడు రాజమౌళి. తన నెక్ట్స్ సినిమా సూపర్‌ స్టార్ మహేష్ బాబుతోనే అని క్లారిటీ ఇచ్చాడు. మీ నెక్ట్స్ సినిమా ఎవరితో మహేష్, ప్రభాస్‌ల పేరు వినిపిస్తోందన్న టాక్‌ వినిపిస్తోంది అంటూ యాంకర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు రాజమౌళి.

`ఇందులో చర్చ ఏముంది.. ఎప్పటి నుంచో అందరికీ తెలిసిందేగా నారాయణగారి నిర్మాణంలో మహేష్ బాబు హీరోగా నేను సినిమా చేయాల్సి ఉంది. అదే నా నెక్ట్స్ ప్రాజెక్ట్` అంటూ క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. దీంతో ఆర్ ఆర్ ఆర్ తరువాత రాజమౌళి, మహేష్ బాబు హీరోగా ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించటం ఖాయం అని తేలిపోయింది.

అయితే మహేష్ బాబుతో రాజమౌళి ఎలాంటి సినిమా తెరకెక్కించనున్నాడు అన్న చర్చ కూడా మొదలైంది. గతంలో మహేష్ బాబుతో బాండ్ తరహా సినిమా చేయాలనుందని చెప్పాడు జక్కన్న. మరి ఇప్పుడు అలాంటి కథే రెడీ చేస్తాడా..? లేక మరేదైనా కథతో వస్తాడా అన్న విషయం తెలియాల్సి ఉంది.