ప్రముఖ బాలీవుడ్ నటుడు రంజిత్ చౌదరి(65) బుధవారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా రంజిత్ చౌదరి మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రంజిత్ చౌదరి.. ఖుబ్సూరత్, మిస్సిసిపీ మసాలా, బందిపోట్ క్వీన్ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 

రంజిత్ చౌదరికి హాలీవుడ్ తో కూడా అనుబంధం ఉంది. లోన్లీ ఇన్  అమెరికా, లాంటి హాలీవుడ్ చిత్రాలతో పాటు టివి సిరీస్ లో కూడా రంజిత్ చౌదరి మెరిశారు. అమెరికాలో రంజిత్ చౌదరి ప్రిజన్ బ్రేక్ అనే టివి సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. 

రంజిత్ చౌదరి మరణంతో బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. బాలీవుడ్ హీరో రాహుల్ ఖన్నా, దర్శకురాలు దీప మెహతా రంజిత్ చౌదరి మృతికి సంతాపం తెలిపారు. 

రంజిత్ చౌదరి 1978లో సినీ రంగ ప్రవేశం చేశారు. రచయితగా కూడా సత్తా చాటారు. గత కొంతకాలంగా రంజిత్ చౌదరి అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనితో శస్త్రచికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించారు.