ఇటీవల జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత షార్ట్ బ్రేక్‌ తరువాత మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పింది. సీనియర్‌ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ బయోపిక్‌ కోసం సమంతను సంప్రదించారు. ప్రముఖ కర్నాటిక్‌ సింగర్‌ నాగరత్నమ్మ జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను రూపొందిస్తున్నాడు సింగీతం. ఈ సినిమాలో నాగరత్నమ్మ పాత్రకు సమంత ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్.

ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో విభిన్న చిత్రాలను రూపొందించిన సింగీతం ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీకి రెడీ అవుతున్నాడు. ఆయన చివరగా 2013లో వెల్‌ కం ఒబామా సినిమాను రూపొందించాడు. ఇప్పటి వరకు ఫోక్‌లోర్‌, మైథలాజికల్‌, సైన్స్ ఫిక్షన్, సైలెంట్‌ మూవీలను రూపొందించిన సింగీతం ఇప్పుడు బయోగ్రాఫికల్ మూవీని రూపొందిస్తున్నాడు.

సాతంత్య్రానికి పూర్వం దేవదాసిల వర్గానికి చెందిన నాగరత్నమ్మ మహిళాభుద్యయం కోసం ఎంతో కృషి చేసింది. ఇప్పుడు ఆమె కథను వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు. ముందుగా ఈ సినిమాలో కీలక పాత్రకు అనుష్కను తీసుకోవాలని భావించినా.. ఇప్పుడు సమంతను తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ఎన్నో షేడ్స్‌ ఉన్న ఈ పాత్రలో సమంత నట విశ్వరూపం చూపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సమంత ఇప్పటికే తమిళ యువ దర్శకుడు విఘ్నేష్‌ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న కాతు వాకుల రెండు కాదల్‌ అనే సినిమాకు అంగీకరించింది. లాక్‌ డౌన్‌ ఎత్తి వేసిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, నయనతారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.