ఇప్పటికే సల్మాన్‌కు వాంటెడ్‌(పోకిరి రీమేక్‌)తో విజయాన్ని అందించిన ప్రభుదేవా.. దబాంగ్‌ 3తో మరో హిట్‌ను అందించటానికి సిద్దపడుతున్నారు.   చుల్‌బుల్‌ పాండేగా ‘దబాంగ్‌’, ‘దబాంగ్‌ 2’ చిత్రాల్లో అలరించిన ఆయన, ‘దబాంగ్‌ 3’తో డిసెంబర్‌ 20న మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ చేసారు. ట్రైలర్ లాంచ్ సమయంలో సల్మాన్ ఖాన్ వేసిన జోక్స్, మాటలు ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి.

సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ...‘‘ఈ సినిమా కథ నేనే రాశా. అందుకని, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదల చేయాలనుకున్నాను. ఈ సినిమా హిట్టైతే ... దేశమంతా, అన్ని ప్రాంతాల్లో వాహ్..ఏం కథ అని మెచ్చుకుంటారు. లేదంటే ముంబైలో క్రిటిక్స్ మాత్రమే కాదు... చెన్నై, బెంగళూరు ఇలా అన్ని ప్రాంతాల  విమర్శకుల నుండి తిట్టిపోస్తారు’’ అని సల్మాన్‌ఖాన్‌ అన్నారు.

పాన్ ఇండియా సినిమా మాదిరిగా నాలుగు భాషల్లో రిలీజ్ కావటంతో దేశం మొత్తం తన సినిమా చూసి రివ్యూలు వస్తాయని ఆయన అన్నారు. ఆయన కథ అందించిన సినిమా కావటంతో జనం ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఆసక్తి ఆయనలో ఎక్కువ కనపడింది. ఈ చిత్రంలో సోనాక్షీ సిన్హా, సయీ మంజ్రేకర్‌ హీరోయిన్లు. సుదీప్‌ విలన్‌గా నటించారు.  

సోనాక్షి సల్మాన్‌ భార్యగా నటిస్తుండగా.. ప్లాష్‌బ్యాక్‌లో సయీ మంజ్రేకర్‌తో ఆయన ఆడిపాడనున్నారు.  సౌతిండియన్‌ సినిమా ఫార్మాట్‌లో ‘దబాంగ్‌ 3’ ఉండబోతోంది. కథ, యాక్షన్‌, డ్యాన్సులు, కామెడీ, ప్రేమ సన్నివేశాలు... అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని సల్మాన్ ధీమాగా ‘‘దబాంగ్‌ 3’పై ఏర్పడ్డ అంచనాలను అందుకుంటామనే నమ్మకం ఉంది’’ అన్నారు ప్రభుదేవా.