లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. ముఖ్యంగా ఎప్పుడూ షూటింగ్ లతో బిజీగా ఉండే సినీ తారలు ఈ ఖాళీ సమయాల్లో కుటుంబాలతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తమ అనుభవాలను ఏదో ఒక రకంగా మీడియాతో పంచుకుంటున్నారు. బాలీవుడ్‌ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ముంబైలోని తన ఇంట్లో భార్య కరీనా కపూర్, కొడుకు తైమూర్‌ అలీఖాన్, తల్లి సీనియర్‌ నటి షర్మిలా ఠాగూర్లతో కలిసి ఉంటున్నాడు.

తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆయన ఈ వైరస్‌ ప్రభావంతో ఆయన అనుభవాలను పంచుకున్నాడు. వైరస్‌ ప్రభలుతున్న నేపథ్యంలో తాను తల్లి షర్మిలా, చెల్లెలు సాబా, సోహా తన ఆరోగ్యం, వారి రక్షణ విషయంలో చాలా ఆందోళనకు గురైనట్టుగా వెళ్లడించాడు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `నేను మా అమ్మ ఆరోగ్య విషయంలో చాలా ఆందోళన చెందుతున్నా.. కానీ ఆమె మాత్రం చాలా ధైర్యంగా ఉంది. నేను పూర్తి జీవితం అనుభవించాను, నాకు భవిష్యత్తు మీద ఆశ లేదని చెప్పింది. ఆమె మాటలు వింటే నాకు భయం అనిపించింది. అదే సమయంలో నా చెల్లెలు సాబా, సోహాలను చాలా మిస్ అవుతున్నా.. లాక్ డౌన్‌ కారణంగా వారిని కలవలేకపోతున్నా. అయితే రెగ్యులర్‌ గా వారితో ఫోన్‌లో టచ్‌ లో ఉన్నాను. మనం ప్రస్తుతం ఆపద సమయంలో ఉన్నాం. అందరం కలిసి కట్టుగా పోరాడాలి` అన్నాడు సైఫ్‌.