యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న చిత్రం 'RRR'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదలై పది నెలలు పూర్తి కావొస్తుంది.

దర్శకుడు రాజమౌళి చిత్ర కథకు సంబందించిన కొంత సమాచారం, కొందరు నటీనటుల గురించి తప్ప రాజమౌళి ఎలాంటి వివరాలు బయట పెట్టలేదు. కానీ ఈరోజు సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్, విలన్ల వివరాలను బయటపెట్టారు. ఇప్పటికే సినిమాలో విలన్ గా రే స్టీవెన్ సన్ అనే హాలీవుడ్ నటుడిని కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ పెట్టారు.

'RRR': ఎన్టీఆర్ హీరోయిన్ జెన్నిఫర్ ఫోటోలు!

అలానే లేడీ విలన్ పేరుని బయటపెట్టారు. ఐర్లాండ్‌కు చెందిన నటి ఆలిసన్ డూడీని సినిమాలో విలన్ గా తీసుకున్నారు. ఈ 53 ఏళ్ల హాట్ బ్యూటీ ‘ఇండియానా జోన్స్’, ‘ది లాస్ట్ క్రుసేడ్’, ‘కింగ్ సోలోమాన్స్ మైన్స్’వంటి ఎన్నో బ్లాక్స్ బస్టర్ చిత్రాల్లో నటించారు.

1920 కాలంలో బ్రిటిష్ నేపథ్యంలో జరిగే ఈ కథలో ఎన్టీఆర్ కొమరం భీం, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది.

తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లోతెరకెక్కుతోన్న ఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.