చాలా ఏళ్లుగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా ఎలా తీయాలనే దానిపై కంటే దాన్ని జనాల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే విషయంపై ఫోకస్ పెడుతున్నారు. తను తీసింది నాసిరకం సినిమా అయినా.. దాన్ని ఎలా అమ్ముకోవాలనే దానిపైనే వర్మ దృష్టి మొత్తం ఉంటోంది. వీలైనంత వరకు కాంట్రవర్శియల్ సబ్జెక్ట్ ఎన్నుకుంటాడు.

దానికి కావలసినంత పబ్లిసిటీ వస్తుంది. కథలో వివాదాలు లేకపోతే.. హీరోయిన్ అందాల మీద ఫోకస్ చేస్తుంటాడు. రీసెంట్ గా కొన్ని సినిమా విషయాల్లో వర్మ ఇదే ఫాలో అయ్యాడు. హాట్ పోస్టర్స్, ప్రోమోలు వదిలి కుర్రాళ్లకు ఎర వేస్తుంటాడు. అయితే అన్ని సినిమాలకు ఈ స్ట్రాటజీలు వర్కవుట్ కావు. కంటెంట్ లేకుండా.. నాసిరకంగా తీస్తున్న వర్మ సినిమాలు బాక్సాఫీస్ ఎంత దారుణమైన ఫలితాలు అందుకుంటున్నాయో చూస్తూనే ఉన్నాం.

''హిట్టు సినిమాలే కాదు చెత్త సినిమాల్లో కూడా రికార్డ్ మాదే''

'ఆఫీసర్' సినిమా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా తరువాత తీసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్', 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' వంటి వివాదాస్పద చిత్రాలతో వర్మ బాగానే క్యాష్ చేసుకున్నాడు. అయితే 'ఎంటర్ ది డ్రాగన్', 'బ్యూటిఫుల్' సినిమా విషయంలో వర్మ స్ట్రాటజీలు వర్కవుట్ కావడం లేదు.

ఈ సినిమాల పట్ల ప్రేక్షకులు ఆసక్తి కనబరచడం లేదు. 'బ్యూటిఫుల్' సినిమాని 'రంగీలా' చిత్రాలని ట్రిబ్యూట్ గా చెబుతున్నా.. జనాలు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో జనాల దృష్టిని ఆకర్షించడానికి ప్రీరిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశాడు వర్మ. ఈ ఈవెంట్ లో వర్మ చేసిన చేష్టలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

హీరోయిన్ నైనా గంగూలీతో కలిసి వర్మ స్టేజ్ మీద డాన్స్ చేశాడు. ఎన్నడూ లేని విధంగా వర్మ అందరి ముందు హీరోయిన్ తో కలిసి బ్రేక్ డాన్స్ లు వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదంతా కూడా వర్మ పబ్లిసిటీ కోసమే చేస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కనీసం ఈ జిమ్మిక్కులైనా వర్కవుట్ అయి బిజినెస్ జరుగుతుందేమో చూడాలి. ఇక 'బ్యూటిఫుల్' సినిమాని జనవరి 1న విడుదల చేయనున్నారు.