కరోనా లాక్‌ డౌన్ ప్రభావం సినీ రంగం మీద భారీగా పడింది. చాలా సినిమాల రిలీజ్‌ లు వాయిదా పడటంతో పాటు షూటింగ్ లు కూడా నిలిచిపోయాయి. దీంతో తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో హీరో హీరోయిన్లు తమ పర్సనల్‌ లైఫ్ కు సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆయన సతీమణి ఉపాసన కొణిదెల.

`రామ్ చరణ్‌ ఆయన భార్య కోసం వంట చేస్తున్న సమయం. అందరు భర్తలకు చెపుతున్న చరణ్ భార్య కోసం వంట చేయటమే కాదు తరువాత అంతా క్లీన్ చేశాడు. అందుకే తను నా హీరో` అంటూ కామెంట్ చేసింది ఉపాసన. ఈ వీడియోపై నెటిజెన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. మెగా పవర్ స్టార్ అయితే ఏంటి..? ఇంట్లో ఉంటే వంట చేయాల్సిందే అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. చెర్రీ సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండడు. అందుకే ఆయనకు సంబంధించి విశేషాలన్నీ ఉపాసన తన సోషల్ మీడియా పేజ్‌ ద్వారా తెలియజేస్తుంటుంది.

ఆర్ఆర్ఆర్‌ షూటింగ్ కు బ్రేక్ పడటంతో రామ్ చరణ్ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు. వినయ విధేయ రామ సినిమా డిజాస్టర్ కావటంతో బ్రేక్ తీసుకున్న చరణ్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తున్నాడు. పీరియాడిక్‌ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో  చరణ్ అల్లూరి సీతా రామ రాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల రామ్ చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా రిలీజ్ చేసిన  ఈ సినిమా టీజర్‌కు సూపర్బ్ రెస్సాన్స్‌ వచ్చింది.