ఫ్యాన్స్  లెక్కలు ఎప్పుడూ వేరే. ప్రపంచం మొత్తం కరోనా అంటూ కంగారుతో,భయంతో ఉన్నా, హీరోలు అభిమానులు మాత్రం వాళ్ల ప్రపంచంలో వాళ్లు ఉంటారు. అంతేకాదు తమ హీరో సినిమాల అప్ డేట్స్ కోసం డిమాండ్ చేస్తూంటారు. ఇది గమనించేనేమో టాలీవుడ్ స్టార్ హీరోలు తమ తాజా చిత్రాల అప్ డేట్స్ తో ఈ కరోనా టైమ్స్ ని కాలక్షేపం టైమ్స్ గా మారుస్తున్నారు. కాస్తంత రిలీఫ్ ఇస్తున్నారు. ప్రభాస్ అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. తమ హీరో తాజా చిత్రానికి సంభందించిన అప్ డేట్స్ ఇమ్మని కోరుతున్నారు. ప్రభాస్ తో సినిమా చేస్తున్న యువి క్రియేషన్స్ ఇవేమీ పట్టనట్లు సైలెంట్ గా ఉండటం వాళ్ళకు నచ్చలేదు. అందుకే బ్యాన్ యువి క్రియోషన్స్ అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేసారు. ఇలా చేస్తే గానీ ఆ టీమ్ కు తెలిసి రాలేదు.

వాస్తవానికి త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని ఈ చిత్రం దర్శకుడు రాధాకృష్ణకుమార్ ఆ మధ్యన ప్రకటించినప్పటికీ.. తరువాత ఎలాంటి అప్ డేట్ లేవు. దీంతో యూవీ క్రియేషన్స్‌పై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కి కోపం వచ్చేసింది. #BanUVCreations అంటూ వారు కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో యూవీ క్రియేషన్స్‌ స్పందించింది.

 ”ప్రపంచమంతా ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితిపై మేము చింతిస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మా పనులన్నీ మేము ఆపేశాం. ఒక్కసారి అన్ని పరిస్థితులు సర్దుకున్నాక.. మేము చాలా అప్‌డేట్లు ఇస్తాం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇంట్లో ఉండి సురక్షితంగా ఉండండి అని అందరినీ కోరుతున్నాం” అని యూవీ క్రియేషన్స్‌ తెలిపింది. మరి ఇప్పటికైనా ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేయటం ఆపుతారేమో చూడాలి.

మరో ప్రక్క ఇప్పటికే రాజమౌళికు చెందిన ఆర్ఆర్ఆర్ టీమ్‌ టైటిల్‌ మోషన్ పోస్టర్‌తో పాటు చెర్రీకి సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. అంతేకాదు ఆ సినిమాలో నటిస్తున్న మరో హీరో  ఎన్టీఆర్‌ వీడియోపై కూడా ఇప్పుడు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు అల్లు అర్జున్ టీమ్‌ కూడా ప్రమోషన్లను ప్రారంభించేసింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న AA20కి సంబంధించిన అప్‌డేట్‌ను బుధవారం బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.