సీనియర్ హీరో నాగార్జున మీడియాతో స్నేహపూర్వకంగానే మెలుగుతుంటారు. ఎవరేం ప్రశ్న అడిగినా.. ఓపికగా సమాధానాలు చెబుతుంటారు. కొన్ని సార్లు ఇబ్బందికర ప్రశ్నలు ఎదురైతే నవ్వుతూ సమాధానం దాటేస్తుంటారు. అలాంటిది తాజాగా ఆయన ఓ యాంకర్ పై కోపం తెచ్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది. 

ప్రతి ఏడాది ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ ని ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులకు అందజేస్తుంటారు. ఈ ఏడాది కూడా ఆ వేడుకకి రంగం సిద్ధం చేస్తున్నారు. దివంగత శ్రీదేవి, సీనియర్ నటి రేఖలకు ఈ అవార్డులను ప్రధానం చేయనున్నారు. 

ANR Awards: శ్రీదేవి, రేఖలకు అక్కినేని జాతీయ అవార్డులు!

ఈ నెల 17న హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో ఈ వేడుక జరగనుంది. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ ని గురువారం నాడు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ క్రమంలో నాగార్జునని ఇంటర్వ్యూ చేయాలనుకుంది ప్రముఖ న్యూస్ ఛానెల్. యాంకర్.. కెమెరా, మైక్ తో రెడీ అయిపోయింది.

ముందుగా ఆమె నాగార్జునను.. 'మీ నాన్నగారు బిగ్ బాస్ హౌస్ లో ఉండి, మీరు హోస్ట్ గా ఉంటే.. మీ రియాక్షన్ ఏంటి..?' అని ప్రశ్నించింది. ఇదే ఇంటర్వ్యూలో మొదటి ప్రశ్న. అయితే ఈ ప్రశ్న నాగార్జునకి నచ్చలేదు. దీంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు.

'లేని నాన్నగారిని బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు లాగుతారు.. ముందు కెమెరా మూసేయండి' అంటూ కాస్త సీరియస్ గానే సమాధానం చెప్పేసరికి యాంకర్ చిన్నబుచ్చుకుంది. ఆ తరువాత యాంకర్ కి నాగార్జునకి మధ్య కాసేపు సంభాషణ జరిగింది. సదరు యాంకర్.. నాగార్జునకి సారీ చెప్పినట్లు తెలుస్తోంది. అలా తొలిప్రశ్న దగ్గరే ఇంటర్వ్యూ ఆగిపోయింది.