టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబులకు ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఒక్కోసారి ఎంతో ప్రేమగా, మరోసారి కాస్త వెటకారంగా మాట్లాడుకునే ఈ ఇద్దరిదీ టామ్ అండ్‌ జెర్రీ బంధం అని అంతా అనుకుంటారు. అయితే ఇరు కుటుంబాల మధ్య ఇటీవల మంచి సాన్నిహిత్యమే కనిపిస్తుంది. అయితే తాజాగా ఈ ఇద్దరు సీనియర్ హీరోలు ఒకే సినిమాలో కలిసి నటించబోతున్నారట.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై రోజుకో రూమర్ వినిపిస్తోంది. ముందుగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నడాన్న వార్త వైరల్‌ అయ్యింది. అయితే చరణ్‌ స్థానంలో మహేష్‌ బాబును తీసుకున్నాడన్న టాక్‌ వినిపించింది. కానీ మహేష్ ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా వచ్చిన వార్తలు రూమర్స్ అంటూ కొట్టి పారేశారు చిత్రయూనిట్.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో రూమర్ బయటకు వచ్చింది. ఆచార్యలో మోహన్‌ బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడట. గతంలో చిరు మోహన్‌ బాబు చాలా సినిమాల్లో కలిసి నటించారు. కానీ ఈ మధ్య కాలంలో వాళ్లు ఎప్పుడూ కలిసి నటించలేదు. దీంతో ఈ కాంబినేషన్‌పై మరింత క్రేజ్‌ ఏర్పడింది. మరి నిజంగానే మోహన్‌ బాబు ఆచార్యలో నటిస్తున్నాడా..? మహేష్ బాబు పేరు లాగే.. మోహన్‌ బాబు పేరు కూడా తెర మీదకు వచ్చిందా..? తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.