స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో, సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రాలు సంక్రాంతికి పోటీ పడేందుకు సిద్ధం అయ్యాయి. సంక్రాంతికి పోటీ ఎప్పుడూ ఉండేదే. కానీ ఈసారి కాస్త గందరగోళంగా మారింది. అందుకు కారణం అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు రెండు చిత్రాలు జనవరి 12న రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్నాయి. 

ఇద్దరు బడా హీరోల చిత్రాలు ఒకే రోజు విడుదలైతే డ్యామేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇద్దరి హీరోల చిత్రాలకు ఓపెనింగ్స్ పై దెబ్బ పడుతుంది. అయినా కూడా చర్చలు విఫలమయ్యాయో, పంతాలకు పోయారో తెలియదు కానీ ఒకే రోజు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. 

ఈ అంశం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు చిత్ర పరిశ్రమ పెద్దగా దాసరి నారాయణరావు ముందుకు వచ్చి మాట్లాడేవారు. పోటీ అనవసరం అని చెప్పేవారు. ఇప్పుడు ఆ భాద్యత నిర్వహించే సినీ పెద్దలు కనిపించడం లేదు. కానీ ఈ ఇష్యూ మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది. 

ఈ సమస్యని పరిష్కరించేందుకు చిరంజీవి ఇరు వర్గాల నిర్మాతలతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారని వినికిడి. కనీసం ఈ రెండు చిత్రాలకు మధ్య ఒక రోజు గ్యాప్ ఉండేలా చిరంజీవి చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిరంజీవి అమెరికా పర్యటనకు వెళ్లారు. తిరిగి రాగానే అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్ర నిర్మాతలతో మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది. 

Ala Vaikunthapurramuloo : భారీ ధరకి హిందీ డిజిటల్, శాటిలైట్ రైట్స్!

మెగాస్టార్ జోక్యంతో అయినా బన్నీ, మహేష్ పంతం వీడుతారో లేదో చూడాలి. అల వైకుంఠపురములో చిత్రాన్ని మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ చిత్రంతో లేడీ అమితాబ్ విజయశాంతి టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్నారు.