హైదరాబాద్: ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరు మీద తనను దుర్భాషలాడుతున్న వ్యక్తులపై సినీ తార మీరా చోప్రా మరోసారి మండిపడ్డారు. ఎఫ్ఐర్ నమోదు చేసిన తర్వాత కూడా వారు రెచ్చిపోవడం ఆపలేదని ఆమె అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆమె మరోసారి తారక్ ఫ్యాన్స్ మీద విరుచుకుపడ్డారు. తనను దూషిస్తున్నవారి తీరుపై ట్వీట్ చేస్తూ దాన్ని ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ మంత్రి తానేటి వనితకు ట్యాగ్ చేశారు. తనపై గ్యాంగ్ రేప్ చేస్తామన్నారని ఆమె ఫిర్యాదు చేశారు.

మీరా చోప్రా వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు చెప్పుకుంటున్నవాళ్లు అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేస్తున్నారు. నోటితో ఉచ్చరించడానికి, రాయడానికి వీలు లేని పదజాలం కూడా వాడుతున్నారు. దాంతో మీరా చోప్రా మరోసారి తన ఆవేదన వ్యక్తం చేస్తూ తారక్ అభిమానులపై విరుచుకుపడ్డారు. 

ఈ విషయంపై కూడా తాను ఫిర్యాదు చేయదలుచుకున్నట్లు మీరా చోప్రా తెలిపారు. అది మితిమీరిన దూషణ ఆమె అన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కూడా వారు ఆగడం లేదని ఆమె అన్నారు. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. 

 

కనీసం మా గొంతును కూడా వినిపించనివ్వరా అని ఆమె ప్రశ్నించారు. తమ తల్లిదండ్రులు చనిపోవాలని కోరుకున్నారని మీరా చోప్రా అన్నారు. తనపై సామూహిక అత్యాచారం చేస్తామని అన్నారని, యాసిడ్ దాడి చేస్తామని బెదిరించారని ఆమె అన్నారు. 

తనను అసభ్య పదజాలంతో తిట్టారని ఆమె అన్నారు. ఇవాళ నేను, రేపు మరొకరు అని ఈ పోరాటంలో తాను నిలబడుతానని అన్నారు. ప్రస్తుతం వాళ్లు (ఎన్టీఆర్ అభిమానులమనని చెప్పుకుంటున్నవారు) మిగతా నటులను కూడా అవమానపరుస్తున్నారని మీరా చోప్రా అన్నారు. అసలు వాళ్లు ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. 

మహిళల గౌరవం పక్కన పెట్టండి, కనీసం వారు ఎవరికీ గౌరవం ఇవ్వడం లేదని ఆమె అన్నారు. తనను ఎవరైతే  దూషిస్తున్నారో వారందరికీ తాను ఒక్కటే చెప్పదలుచుకున్నట్లు తెలిపారు. 

ఇప్పుడు మనమంతా కోవిడ్ -19 రూపంలో ఓ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నామని, ప్రపంచంలో ఎతంో మంది ఈ వైరస్ బారిన పడి మరణిస్తున్నారని అంటూ కానీ మీరు మాత్రం.. మీ అభిమాన నటుడు నాకు తెలియదన్నందుకు నన్ను దూషిస్తూ రాక్షసానందం అనుభవిస్తున్నారని, ముందు వెళ్లి మీ జీవితాలను కాపాడుకోండి అని మీరా చోప్రా అన్నారు.