కియారా అద్వానీ.. శుక్రవారం బర్త్ డే జరుపుకుని హ్యాపీ మూడ్‌లో ఉంది. కరోనా వల్ల తన ఇంట్లోనే ఒంటరిగా బర్త్ డే జరుపుకున్న ఆమె సోషల్‌ మీడియాలో ఆ ఫోటోలు పంచుకుని తన ఆనందాన్ని షేర్‌ చేసుకుంది. దీంతో సెలబ్రిటీలందరు ఆమెకి బర్త్ డే విశెష్‌తోపాటు భవిష్యత్‌ ప్రాజెక్ట్ ల విషయంలో అభినందనలు చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే కియారా అద్వానీ మరో తెలుగు సినిమా దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. మహేష్‌బాబు నటించిన `భారత్‌ అనే నేను`తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సెక్సీ భామ తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. మంచి నటనని ప్రదర్శించింది. ఆ వెంటనే రామ్‌చరణ్‌తో `వినయ విధేయ రామ`లో నటించి ఆకట్టుకుంది. అచ్ఛం తెలుగమ్మాయిలా ముస్తాబై అలరించింది. అయితే మరోసారి మహేష్‌ సరసన `సర్కారు వారి పాట` కోసం ఆమెని సంప్రదించారు. కానీ కాల్షీట్లు కుదరకపోవడంతో ఆ ప్రాజెక్ట్ సెట్‌ కాలేదు. 

తాజాగా తెలుగులో మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏకంగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన రొమాన్స్ చేయబోతుందట. త్రివిక్రమ్‌ దర్శత్వంలో ఓ సినిమా రూపొందనుంది. దీన్ని పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కించబోతున్నారు. `ఆర్‌ ఆర్‌ ఆర్‌` తర్వాత విడుదల కానున్న సినిమా కావడం, `అల వైకుంఠపురములో`తో భారీ బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్నసినిమా కావడంతో దీన్నిపాన్‌ ఇండియా లెవల్‌లో హిందీతోపాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే ఓ హీరోయిన్‌ ఎంపిక చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా కియారాని అప్రోచ్‌ కాగా, ఆమె తన విల్లింగ్‌ని వ్యక్తం చేసినట్టు టాక్‌. మొత్తానికి మళ్ళీ  కియారా టాలీవుడ్‌ సినిమా ఖరారైందని అంటున్నారు. 

ఇదిలా ఉంటే రాఘవ లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కనున్న `చంద్రముఖి 2`లోనూ హీరోయిన్‌గా కియారానే తీసుకోబోతున్నారట. ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వం వహిస్తోన్న `లక్ష్మీబాంబ్‌`లో అక్షయ్‌ కుమార్‌ సరసన నటిస్తుంది కియారా. ఇందులో ఆమె నటనకు ఇంప్రెస్‌ అయిన లారెన్స్  `చంద్రముఖి 2`కి ఎంపిక చేసినట్టు టాక్‌. దీంతోపాటు కియారా ఇప్పుడు బాలీవుడ్‌లో `ఇందూ కి జవానీ`, `షేర్షా`, `భూల్‌ భులైయ్యా 2`లో నటిస్తుంది. `షేర్షా`లో తన ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో రొమాన్స్ చేస్తున్న విషయం తెలిసిందే.