టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'RRR' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా పూర్తయిన తరువాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నారనే విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

అందుకే మరోసారి త్రివిక్రమ్ తో కలిసి పని చేయడానికి ఎన్టీఆర్ ఆసక్తి చూపిస్తున్నాడు. దాదాపు వీరి కాంబోలో సినిమా ఖాయమైనట్లేనని చెబుతున్నారు. ఈ నెలలోనే సినిమా ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అయితే ఈసారి త్రివిక్రమ్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేయబోతున్నారు.

మరో సంక్రాంతిని బుక్ చేసుకున్న త్రివిక్రమ్

బహుసా సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు ఉండకపోవచ్చు. ఉన్నా కూడా అవి భారీ యాక్షన్ సీక్వెన్స్ మాదిరి కాకుండా చాలా సింపుల్ గా ఉంటాయని చెబుతున్నారు. 'అరవింద సమేత' మాదిరి ఎన్టీఆర్ లో వీరత్వాన్ని కాకుండా కామెడీ యాంగిల్ ని ఈ సినిమాలో చూపించబోతున్నారు.

గతంలో జంధ్యాల నుండి వచ్చిన ఫ్యామిలీ కామెడీ సినిమాల మాదిరి పక్కా ఎంటర్టైన్మెంట్ లైన్ ని త్రివిక్రమ్ రెడీ చేశారు. అది స్క్రిప్ట్ గా మార్చాల్సివుంది. ఏప్రిల్ నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హారిక హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ కాంబినేషన్ లో ఈ సినిమాని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.