ఎన్నడూ లేనంతగా నితిన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ అయిపోతున్నాడు. కొన్ని రోజుల క్రితం విడుదలైన భీష్మ చిత్రంతో నితిన్ సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ ఏడాది నితిన్ నుంచి మరికొన్ని చిత్రాలు రాబోతున్నాయి. 

నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శత్వంలో రంగ్ దే అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు ఇటీవల నితిన్ బాలీవుడ్ సూపర్ హిట్ అంధాదున్ రీమేక్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడు. బాలీవుడ్ లో ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధిక ఆప్టే కీలక పాత్రల్లో నటించారు. 

ఈ చిత్రంలో టబు పాత్రకు సరిపడే నటి కోసం ప్రస్తుతం చిత్ర యూనిట్ అన్వేషిస్తోంది. ఇక అంధాదున్ చిత్రాన్ని అలాగే దించేయకుండా కొన్ని మార్పులు కూడా చేయబోతున్నారట. అందులో ముఖ్యంగా నితిన్ దర్శకుడిని కోరుతున్నది.. శృంగార భరిత సన్నివేశాలు తొలగించాలని. అంధాదున్ లో ఆయుష్మాన్, రాధికా ఆప్టే మధ్య హీటెక్కించే రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. 

తెలుగు రీమేక్ లో ఆ సన్నివేశాలు వద్దని నితిన్ దర్శకుడు మేర్లపాక గాంధీకి సూచించినట్లు తెలుస్తోంది. అలాంటి సన్నివేశాలు ఉంటే సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రమే పరిమితం అవుతుందనేది నితిన్ భయం. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని చూసే విధంగా ఉండాలని నితిన్ భావిస్తున్నాడు. 

బిగ్ బాస్ కౌశల్ ఎమోషనల్ పోస్ట్.. 'నా భార్య కల నెరవేరబోతోంది'!

అంధాదున్ రీమేక్ లో టబు పాత్ర కోసం యాంకర్ అనసూయతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. ఇక హీరోయిన్  పాత్ర కోసం కూడా స్టార్ హీరోయిన్స్ తోనే చర్చలు జరుపుతున్నారు. అంధాదున్, రంగ్ దే చిత్రాలతో పాటు నితిన్ త్వరలో చంద్రశేఖర్ యేలేటి దర్శత్వంలో చెక్ అనే మూవీలో నటించబోతున్నాడు.