బిగిల్ చిత్రం విడుదల కానుండడంతో తమిళనాడు వ్యాప్తంగా సందడి నెలకొంది. విజయ్ అభిమానులు థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. అట్లీ విజయ్ కాంబినేషన్ లో వచ్చిన తేరి, మెర్సల్ అద్భుతమైన విజయాలుగా నిలిచాయి. దీనితో బిగిల్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 

ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలని రెట్టింపు చేసింది. ఫుట్ బాల క్రీడ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ ఎమోషనల్ మూవీ ఇది. ఇదిలా ఉండగా రేపు సినిమా విడుదల అనగా నేడు తమిళనాడు ప్రభుత్వం బిగిల్ చిత్రానికి షాకిచ్చింది. బిగిల్ మూవీ ప్రత్యేక షోలకు అనుమతిని నిరాకరించింది. పైగా టికెట్స్ రేట్లపై కూడా ఆంక్షలు విధించింది. బిగిల్ చిత్ర ప్రత్యేక షోలకు అనుమతి లేదని మంత్రి కడంబూర్‌ రాజు స్వయంగా ప్రకటించారు. 

చాలా కాలంగా విజయ్, తమిళ నాడు ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. విజయ్ సర్కార్ చిత్రానికి కూడా అక్కడి ప్రభుత్వం ఇబ్బందులు సృష్టించిన సంగతి తెలిసిందే. బిగిల్ ఆడియో వేడుకలో విజయ్ తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేంకంగా కామెంట్స్ చేశాడు. 

అప్పటి నుంచి బిగిల్ చిత్రానికి ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ చిత్రంలో మత్సకారులని కించపరిచారు అంటూ కేసు నమోదు కాగా.. ఈ చిత్ర కథ నాదే అని మరో రచయిత తెరపైకియో వచ్చాడు. 

ఇక బిగిల్ చిత్ర ప్రత్యేక షోల కోసం టికెట్స్ ని అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని మంత్రి కడంబూర్‌ రాజు ఆరోపించారు. ప్రత్యేక షోలు లేవు కాబట్టి ప్రేక్షకులకు టికెట్ల డబ్బు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్ర పెట్టుబడి తిరిగి రావాలంటే ప్రత్యేక షోలు ఉండాల్సిందే. ప్రభుత్వం స్పెషల్ షోలు రద్దు చేయడంతో బయ్యర్లలో టెన్షన్ నెలకొంది. 

మంత్రి కడంబూర్‌ రాజుపై సోషల్ మీడియా వేదికగా విజయ్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. బూతులతో కామెంట్స్ చేస్తూ తమ ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. బిగిల్ చిత్రం విజయం సాధించాలని తమిళనాడు వ్యాప్తంగా విజయ్ అభిమానులు పూజలు చేస్తున్నారు. తెలుగులో బిగిల్ చిత్రాన్ని విజిల్ గా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.