ఈ నగరానికి ఏమైంది లాంటి డిఫరెంట్‌ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటుడు విశ్వక్‌ సేన్‌. ఈ సినిమాతో డిఫరెంట్ ఇమేజ్‌ సొంతం చేసుకున్న విశ్వక్ రెండో సినిమానే స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించాడు. మలయాళ సూపర్‌ హిట్ అంగమలై డైరీస్‌ను తెలుగులో ఫలక్‌నుమా దాస్ పేరుతో రీమేక్ చేశాడు విశ్వక్‌ సేన్‌. ఈ సినిమా సూపర్ హిట్ కావటంతో విశ్వక్ కు హీరోగా వరుస అవకాశాలు వచ్చాయి.

యంగ్ హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన తాజా చిత్రం హిట్ లో హీరోగా నటించాడు విశ్వక్ సేన్‌. ఈ సినిమా కూడా సక్సెస్ కావటంతో విశ్వక్ సేన్ రేంజ్ మారిపోయింది. సినిమాలు సక్సెస్ కావటంమే కాదు వివాదాలతో పాపులారిటీ కూడా అదే స్థాయిలో సంపాదించుకున్నాడు ఈ హైదరాబాదీ హీరో. 

హిట్ సినిమాలోని విక్రమ్ రుద్రరాజు పాత్రలో విశ్వక్ నటనకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు వివేక్‌ సాగర్ సంగీతమందించగా వి మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందించాడు. ఈ సినిమా సక్సెస్‌ అయిన సందర్భంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన విశ్వక్‌ సేన్‌ భవిష్యత్తులోనూ దర్శకుడిగా కొనసాగే ఆలోచనలో ఉన్నానని తెలిపాడు. ప్రస్తుతం హీరోగా కొనసాగుతూనే కొన్ని స్క్రీప్ట్స్ మీద కూడా వర్క్ చేస్తున్నట్టుగా వెల్లడించాడు. అంతేకాదు హిందీలోనూ సినిమాను రూపొందించే ఆలోచనలో ఉన్నాడు  ఈ యంగ్ హీరో.

హీరో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ.. తనకు సూపర్‌ స్టార్‌ మహేష్ బాబును డైరెక్ట్ చేయాలనుందని తెలిపాడు. `నేను మహేష్ బాబు సినిమాలు చూస్తూ పెరిగాను. సూపర్‌ స్టార్‌కు నేను చాలా పెద్ద ఫ్యాన్‌ ని. తరువాత ఎన్టీఆర్ అంటే కూడా ఇష్టం ఏర్పడింది. భవిష్యత్తులో తప్పకుండా మహేష్ బాబును డైరెక్ట్ చేస్తా` అన్నాడు.

హిట్ సినిమా తరువాత కొత్త దర్శకుడు నరేష్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. పాగల్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవల ప్రారంభమైంది. ఈ సినిమాలో బెంగళూరు బ్యూటీ క్రితి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.