రీ ఎంట్రీలో సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న మెగాస్టార్ స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఆగిపోయింది. ఈ సినిమాతో చిరంజీవి నక్సలైట్‌గా నటిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. షూటింగ్ ప్రారంభమైన సమయంలో ఈ సినిమాలో 20 నిమిషాల పాటు కనిపించే కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ నటిస్తున్నాడన్న టాక్ వినిపించింది.

కానీ తరువాత చిరంజీవి, మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన తరువాత మరో కొత్త వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌ చల్‌ చేసింది. ఆచార్యలో అతిథి పాత్రలో మహేష్ నటిస్తున్నాడన్న ప్రచారం గట్టిగానే జరిగింది. రామ్ చరణ్ ఆర్ఆర్‌ఆఱ్ షూటింగ్ లో బిజీగా ఉండటంతో ఆ పాత్రకు మహేష్‌ ను తీసుకొని ఉంటారని భావించారు ఫ్యాన్స్‌.

అయితే ఈ వార్తలపై చిరు క్లారిటీ ఇచ్చాడు. మహేష్ ఆ సినిమాలో నటించటం లేదని అతిథి పాత్రలో చరణే కనిపిస్తాడని క్లారిటీ ఇచ్చాడు చిరంజీవి. అయితే తాజాగా దర్శకుడు కొరాటల కూడా ఈ వార్తలపై స్పందించాడు. ఈ సినిమాలో మహేష్ నటిస్తున్నాడన్న వార్తలు ఎందుకు మొదలయ్యాయో క్లారిటీ ఇచ్చాడు. చరణ్‌, ఆర్ఆర్ఆర్‌తో బిజీగా ఉండటంతో కొరటాల షూటింగ్ విషయంలో కాస్త టెన్షన్‌ పడ్డాడట. ఆ సమయంలో మహేష్ కొరటాల టెన్షన్‌ను గమనించి, నేను ఉన్నాను కదా టెన్షన్‌ వద్దు అంటూ భరోసా ఇచ్చాడట. దీంతో మహేష్ ఆచార్య నటిస్తున్నాడన్న వార్తలు వినిపించాయంటూ క్లారిటీ ఇచ్చాడు కొరటాల.