మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో మరోసారి ముసలం పుట్టింది. నిన్నటినుండి ఆఫీస్ తలుపులు తెరుచుకోలేదు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలు తలెత్తడంతో సిబ్బంది ఆఫీస్ కి రాలేదని తెలుస్తోంది. గత రెండు రోజులుగా 'మా' కార్యాలయం మూసివేసి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి మాట్లాడడానికి కార్యవర్గ సభ్యులు నిరాకరించినట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా 'మా' అసోసియేషన్ లో వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అధ్యక్షుడు వీకే నరేష్, ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ మధ్య గొడవలు తలెత్తడం, రాజశేఖర్ రాజీనామా చేయడం వంటివి జరిగిన సంగతి తెలిసిందే. చిరంజీవి, మోహన్ బాబు లాంటి పెద్దలు ముందు 'మా' అధ్యక్షులు గొడవ పడడంతో విషయం పెద్దదైంది.

చిరంజీవికే సపోర్ట్ చేసిన సుమన్.. రాజశేఖర్ గురించి అలా..!

ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంలో కల్పించుకుంటున్నా.. సమస్య మాత్రం తీరడం లేదని సమాచారం. అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే.. 'మా' సభ్యులకు కొత్తగా ఏర్పాటైన జెనరల్ బాడీ పింఛను, జీవిత బీమా, వైద్య బీమా వంటి సదుపాయాలు తీసుకొచ్చారు. దీనికి కావాల్సిన ఫండ్స్ అసోసియేషన్ లో లేకపోవడంతో ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ చేయాల్సి ఉంది.

ఈ విషయంలో నరేష్ అంత సీరియస్‌గా లేరని రాజశేఖర్ ఆరోపణలు చేశారు. అంతేకాదు.. అసోసియేషన్ కి సంబంధించిన కొంత మొత్తాన్ని నరేష్ వ్యక్తిగతంగా వాడుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో చాలా కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఇప్పుడు రాజశేఖర్ రాజీనామా చేసినప్పటికీ కార్యవర్గ సభ్యులకు, అధ్యక్షుడికి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే రెండు రోజులుగా 'మా' కార్యాలయాల తలుపు తెరుచుకోవడం లేదని తెలుస్తోంది.