యువ హీరో నితిన్ చాలా కాలం తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'భీష్మ' నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా లాంగ్ గ్యాప్ తీసుకున్న నితిన్ తప్పకుండా సక్సెస్ అందుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఓవర్సీస్ లో సినిమా ప్రీమియర్స్ ని గట్టిగానే ప్రదర్శించారు.

భీష్మ సినిమాపై మొదటి నుంచి ఆడియెన్స్ లో పాజిటివ్ టాక్ అందుకుంటోంది. సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇక సినిమాలో నితిన్ భీష్మ క్యారెక్టర్ లో సరికొత్తగా దర్శనమిచ్చాడు. ఛలో సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ ని బయటపెట్టిన వెంకీ కుడుముల మరోసారి అదే తరహాలో ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశాడు. దాంతో పాటు సినిమాలో యాక్షన్ ని కూడా సరికొత్తగా ప్రజెంట్ చేశాడు.

కథలో లవ్ ట్రాక్ ని నడిపిస్తూనే మంచి సోషల్ పాయింట్ ని కూడా ఎలివేట్ చేస్తూ ఆడియెన్స్ కి మంచి ఫీల్ ని కలిగించాడు.  ఇక నితిన్ సింగిల్ వేశాలతో పాటు రష్మీక పొగరు సినిమాలో మేజర్ రోల్ ప్లే చేశాయి. సెకండ్ హాఫ్ వరకు సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ తో కొనసాగుతుంది. అయితే సెకండ్ హాఫ్ అనంతరం కొంచెం స్లోగా సాగే ఎపిసోడ్స్ ఓ వర్గం ఆడియెన్స్ ని బోర్ కొట్టించే అవకాశం లేకపోలేదు.

ఇక క్లయిమ్యాక్స్ కూడా అనుకున్నంతగా ఎలివేట్ కాలేదనిపిస్తోంది. సినిమాలో విలన్ రోల్స్ ని వెంకి మంచి టైమింగ్ తో ప్రజెంట్ చేశాడు. ఇక సాంగ్స్ సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు. ఒక్క సాంగ్ మినహా ఏది పెద్దగా ఆకట్టుకోదు. మొత్తానికి వరుస పెట్టి డిజాస్టర్స్ అందుకున్న నితిన్ కి భీష్మ కాస్త బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రవాసుల నుంచి పాజిటివ్ టాక్ అందుకుంటున్న ఈ సినిమా లోకల్ ఆడియెన్స్ ని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.