సొంత హోటల్ ని భర్తతో కలిసి క్వారంటైన్ కేంద్రంగా మార్చిన అయేషా టాకియా
అయేషా టాకియా తన భర్త హోటెలీర్ ఫర్హాన్ ఆజ్మి తో కలిసి ముంబై కోలోబా ప్రాంతంలోని తమ గల్ఫ్ హోటల్ ను ఈ కరోనా వేళ క్వారంటైన్ సెంటర్ గా వాడుకునేందుకు అధికారులకు అప్పగించారు.
సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అయేషా టాకియా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆ సినిమాలో నాగార్జునకు జోడిగా, సోను సూద్ కి చెల్లెలిగా తన నటనతో మెప్పించడమే కాకుండా, తన అందాలతో కుర్రకారు మనసులను కూడా కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా అయేషా టాకియా తన భర్త హోటెలీర్ ఫర్హాన్ ఆజ్మి తో కలిసి ముంబై కోలోబా ప్రాంతంలోని తమ గల్ఫ్ హోటల్ ను ఈ కరోనా వేళ క్వారంటైన్ సెంటర్ గా వాడుకునేందుకు అధికారులకు అప్పగించారు. ఇందుకు సంబంధించి అయేషా టాకియా భర్త తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు.
కోలోబా పోలీస్ స్టేషన్ సీనియర్ ఆఫీసర్ అభ్యర్థన మేరకు తన హోటల్ ను ముంబై నగరపాలక సంస్థకు, ముంబై పోలీసులకు క్వారంటైన్ కేంద్రంగా వాడుకునేందుకు ఇచ్చినట్టు ఆయన తెలిపాడు.
కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న వేళ, కరోనా పై పోరులో ముందు వరసలో ఉంది పోరాడుతున్న పోలీసులకు తన హోటల్ ను క్వారంటైన్ కేంద్రంగా ఇవ్వడం వారికి నా వంతుగా నేను చేయగలిగిన చిన్న సహాయం అని రాసుకొచ్చాడు.
సమాజ్ వాది పార్టీ నేత అబూ ఆజ్మి కుమారుడైన ఫర్హాన్ ను అయేషా టాకియా 2009లో ప్రేమించి పెళ్లాడింది. వీరికి మిఖాయిల్ అనే కుమారుడు కూడా ఉన్నాడు.
ఇదే నెల ఆరంభంలో మరో ఫేమస్ బాలీవుడ్ నటుడు, తెలుగు విలన్ సోను సూద్ కూడా ముంబైలోని తన హోటల్ ని క్వారంటైన్ కేంద్రానికి ఇచ్చాడు. వైద్య సేవలను అందిస్తున్న సిబ్బందికి తన హోటల్ ను ఇచ్చినట్టు ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చాడు.
షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతులు కూడా తమ ఆఫీస్ కార్యాలయాన్ని ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రభుత్వానికి వాడుకోవడానికి అనుమతినిచ్చారు. దీనికి ఏకంగా అధికారులే థాంక్స్ తెలిపారు.