రానా ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ తెరకెక్కుతోన్న వైవిధ్యమైన చిత్రం ‘అరణ్య’. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం నిర్మితమవుతోంది. హిందీలో 'హథీ మేరే సాథి', తమిళంలో 'కాండన్' టైటిల్స్‌తో తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ సైతం ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ సినిమాలో రానా మావటివాడిగా నటించారు. జంతు ప్రేమికుడు, నేషనల్ అవార్డ్‌ గ్రహీత ప్రభు సాల్మన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

పాత్రకి తగ్గట్లుగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకునే రానా ఈ సినిమా కోసం కూడా చాలా కష్టపడ్డాడు. ఏనుగులను మచ్చిక చేసుకోవడం కోసం ఎక్కువ సమయంలో అడవిలోనే గడిపారట రానా. కథ విని క్యారెక్టర్‌ను అర్థం చేసుకోవడానికి రానాకి ఆరు నెలల సమయం పట్టిందని తెలుస్తోంది.

మూడు భాషల్లో ఒకేసారి సినిమాని చేయడం రానాకి మరో ఛాలెంజ్. ఈ సినిమా తన కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెబుతున్నారు రానా. ఆయన అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన నటుడు పాత్ర కోసం చేస్తోన్న కృషి చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

పద్మశ్రీ అవార్డు పొందిన జాదవ్‌ ప్రియాంక్‌ అనే వ్యక్తి జీవితం స్ఫూర్తితో అస్సాంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అడవిని నమ్ముకొని ఉన్న ఓ ఆదివాసి.. ఆ అడవికి ఆపద వస్తే ఏం చేశాడన్న కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఏప్రిల్ 2న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.