ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో హిట్ ఆల్బమ్స్ అందించిన ఆయన ఇప్పటికీ తన మ్యూజిక్ తో శ్రోతలను అలరిస్తూనే ఉన్నాడు. ఆయన పాటలు ఎంతో స్పెషల్ గా ఉంటాయి. అలాంటిది ఆయన కష్టపడి కంపోజ్ చేసిన పాటలను రీమిక్స్ పేరుతో నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెహ్మాన్.

ఈ మధ్యకాలంలో చాలా మంది సంగీత దర్శకులు ఇలాంటి కంప్లైంట్స్ చేస్తున్నారు. పాటలు కంపోజ్ చేయడం రాకపోతే మానుకోవాలి కానీ ఒరిజినల్ సాంగ్స్ ని రీమిక్స్ చేసి వాటి విలువను పోగొట్టకూడదని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఇప్పుడు ఏఆర్ రెహ్మాన్ కూడా తన పాటలను రీమిక్స్ చేసి నాశనం చేస్తున్నారంటూ తొలిసారి మీడియా ముందుకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తను కంపోజ్ చేసిన చాలా పాటలను రీమిక్స్ లుగా మార్చారని.. ఒరిజినల్ పాటలను నాశనం చేశారని అన్నారు. ఇప్పటివరకు వచ్చిన రీమిక్స్ లో తనకు నచ్చిన పాట 'హమ్మ హమ్మ' అని.. మిగతావన్నీ రోత పుట్టించేలా ఉన్నాయని చెప్పారు.

ఒరిజినల్ పాటలను ఇష్టపడే వారు ఇంకా ఉన్నందున తనకు సంతోషంగా ఉందని అన్నారు. ప్రస్తుతం తన ఇతర పనులతో బిజీగా ఉన్నానని.. అందుకే హిందీ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని.. తనొక స్టూడియో నిర్మిస్తున్నారని.. అందులోనే తన పిల్లలకు సంగీతం నేర్పిస్తున్నానని తెలిపారు. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రెహ్మాన్.. ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కిస్తున్న సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.