కరోనా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా బయోత్పాత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రజల్లో ఈ పరిస్థితుల పట్ల అవగాహన కలిగించేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో అవగాహన కలిగిస్తూ సెలబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మరో అడుగు ముందుకు వేసి ఓ షార్ట్‌ ఫిలిం లో నటించేందుకు ఇండియా మెగాస్టార్స్‌, సూపర్‌ స్టార్స్ ముందుకు వచ్చారు.

అమితాబ్ బచ్చన్‌, రజనీకాంత్‌, చిరంజీవి, ప్రియాంక చోప్రా, రణబీర్‌ కపూర్‌, అలియా భట్‌లతో పాటు మరికొందరు కలిసి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఓ లఘు చిత్రంలో నటిస్తున్నారు. కోవిడ్ 19 ప్రభావంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ షార్ట్‌ ఫిలింను రూపొందిస్తున్నారు. ఈ షార్ట్‌ ఫిలింకు ఫ్యామిలీ అనే టైటిల్‌ను నిర్ణయించారు.

ప్రసూన్‌ పాండే దర్శకత్వంలో అమితాబ్‌ బచ్చన్‌ పర్యవేక్షణలో రూపొందిస్తున్న ఈ షార్ట్‌ ఫిలింలో ఇంట్లోనే ఉండాల్సిన ఆవశ్యకత, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం, ఇంటి నుంచే పనులు చేసుకోవటం, సోషల్ డిస్టాన్సింగ్ పాటించటం లాంటి వాటిలో సలహాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే `వియ్‌ ఆర్ వన్` అనే పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌.

ప్రసూన్ రూపొందిస్తున్న షార్ట్‌ ఫిలిం విషయానికి వస్తే.. ఈ ఫిలింను పూర్తిగా విర్చువల్ టెక్నాలజీ ద్వారా రూపొందిస్తున్నారు. ఇందుకోసం చాలా మంది సెలబ్రిటీలు స్వయంగా నటించేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఈ షార్ట్ ఫిలిం ఎప్పుడు ఈ ప్లాట్‌ ఫాంలో ప్రదర్శిస్తారన్న విషయం తెలియాల్సి ఉంది.

సోని పిక్చర్స్‌, కళ్యాణ్ జ్యువెలర్స్‌తో కలిసి బిగ్‌ బి, లక్ష కుటుంబాలకు నిత్యావసరాలను అందిస్తున్నారు. ఈ కార్యక్రమంపై సోనీ పిక్చర్స్ సీఈఓ ఎన్పీ సింగ్‌, `కష్టకాలంలో మన మంతా కలిసికట్టుగా ఈ పరిస్థితిపై పోరాడాల్సిన సమయం వచ్చింది. అమితాబ్‌ బచ్చన్‌, కళ్యాణ్ జ్యువెలర్స్‌తో సినీ టీవీ రంగాల్లో పనిచేస్తున్న రోజూవారి కార్మికులకు సాయమందిస్తున్నారు.