ఇక్కడ... తోపు లీడర్ల కంటే పవన్ కళ్యాణే బెటర్

ఇక్కడ... తోపు లీడర్ల కంటే పవన్ కళ్యాణే బెటర్

 

తెలుగు రాష్ట్రాల్లో చాలాకాలం తరువాత నిండుదనంతో కూడిన ఒక పూర్తి స్థాయిమీడియా సమావేశం కనిపించింది. నేను చెప్పిందే రాసుకో.. లేదంటే మూస్కొని పో.. అనే లీడర్లున్న ఈ రోజుల్లో.. జర్నలిస్టులు మీడియా సమావేశాల్లో ప్రశ్నలడిగే పరిస్థితే లేదు. కానీ.. కసిగా ప్రశ్నలు అడగాలని ఆశతో ఉన్న జర్నలిస్టులకు సూటిగా ప్రశ్నించే అవకాశం వచ్చింది. సమాచారాన్ని రాబట్టేందుకు ప్రశ్నించి తమ డ్యూటీ హ్యాప్పీగా చేశామనుకుని ఫీల్ అయ్యే రోజు ఇది. మరి ఇదంతా జరిగింది కరీంనగర్ గడ్డ మీద. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. జర్నలిస్టులు వంద శాతం స్వేచ్ఛగా ప్రశ్నలడిగారు. జర్నలిస్టుల ప్రశ్నలతో పవన్ ఉక్కిరి బిక్కిరి కావొచ్చు.. కొన్నింటికి సమాధానం చెప్పొచ్చు.. చెప్పలేకపోవచ్చు... అడ్డదిడ్డంగా తనకు తోచింది చెప్పొచ్చు.. కానీ.. చివరి ప్రశ్న వరకు అవకాశం దొరికింది.

గత కొన్ని సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా కాన్ఫరెన్స్ లు వన్ సైడ్ లవ్ స్టోరీల మాదిరిగా వన్ సైడ్ మీటింగ్ లుగానే సాగుతున్నాయ. మెజార్టీ మీడియా సంస్థలు ఒక పార్టీకో లేదా ఒక నాయకుడికో అనుబంధంగా మారడంతో ఈ దుస్థితి వచ్చింది. మీడియా ప్రశ్నలు అడిగితే నేతలు సమాధానాలు చెప్పే రోజులు అంతరించిపోయాయి. తమ అనుకూల మీడియాను పిలుచుకొని , అనుకూల ప్రశ్నలు వేయించుకునే సంస్కృతికి అన్ని పార్టీల నేతలు తెరతీశారు. దీంతో జర్నలిస్టులకు ప్రజల తరుపున ప్రశ్నలు అడిగే అవకాశం లేకుండా పోయింది.

రెండు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి అధికార పక్షానికి కొన్ని మీడియా సంస్థలు, ప్రతిపక్షానికి కొన్ని మీడియా సంస్థలు వకాల్తా పుచుకుంటున్నాయి. దీంతో ఎవరి డప్పు వారు వారి చానల్ లో కొట్టుకోవడమే కాదు. ప్రెస్ మీట్ లో కూడా ఇతర మీడియా సంస్థల ప్రతినిధులు ప్రశ్నలు వెయ్యకుండా బాధ్యతలు ఆయా మీడియా సంస్థలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇక మీడియా సమావేశాలకు వెళ్లడమే దండగ అని ప్రజల కోసం పనిచేసే కొంతమంది నిఖార్సైన జర్నలిస్టులు డిసైడ్ అయిపోవల్సిన పరిస్థితులు రెండు రాష్ట్రాల్లో నెలకొన్నాయి.

మీడియా సమావేశాల్లో ఇబ్బందికర ప్రశ్నలు వచ్చినప్పుడు జర్నలిస్టులకు సమాదానం చెప్పలేని నేతలు తమ అనుకూల మీడియా మిత్రుల సహకారంతో జర్నలిస్టులపై సెటైర్లు వెయ్యడం ఒక ట్రెండ్ గా మారిపోయింది. అలా మరో సారి ప్రశ్నలు వెయ్యకుండా పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యంగా ఓపెన్ ప్రెస్ మీట్ లు కూడా ఈ మధ్యకాలంలో లేవు. కేవలం వారికి అనుకూల మీడియా ప్రతినిధులు వచ్చే విధంగా హైదరాబాద్ లో పెట్టుకోవడం లేదంటే హైదరాబాద్ నుంచి వారిని తీసుకొని వెళ్లి అక్కడ వారికి అనుకూల ప్రశ్నలు వేయించుకోవడం.

ఈ సంస్కృతి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ప్రధానంగా ప్రారంభమైనప్పటికి ఇటీవల కాలంలో ఇది తీవ్రరూపం దాల్చిందనే చెప్పుకోవాలి. ఒక స్థాయిలో తమను ప్రశ్నిస్తున్న మీడియా సంస్థలను బహిష్కరించే స్థాయి కూడా వచ్చింది. గతంలో సాక్షి, టి న్యూస్ చానళ్లను తమ కార్యాలయాలకు రావద్దని టీడీపీ హుకూం జారీ చేసింది. అలాగే అనేక సంధర్భాల్లో ఈనాడు, ఏబీఎన్ ప్రతినిధులపై వైసీపీ అనేక సంధర్భాల్లో సెటైర్లు వేసింది. ఇదంతా ఒక వైపు అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ మధ్యకాలంలో లెఫ్ట్ పార్టీల అనుబంధ పేపర్లపై వివాదాస్పద కామెంట్స్ చేశారు.

ఈ సంఘటనలన్నీ చూస్తున్న సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియా సమావేశం మీడియా స్వేచ్ఛను గుర్తు చేసింది. కరీంనగర్ జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో పవన్ మీడియాను స్వేచ్ఛగా అడిగే చాన్స్ ఇచ్చాడు. అనేక అంశాలకు ఆయన సంబంధం లేని సమాధానాలు చెప్పొచ్చు గాక.. అయినా ప్రశ్నించే అవకాశం ఇచ్చాడన్నది అసలు మ్యాటర్. మరి రాజకీయాలకు కొత్త అని అలా అవకాశం ఇచ్చాడా, లేక వాస్తవంగా నిజాయితీగా ఉండాలి అనుకుంటున్నాడా అన్నది భవిష్యత్తు తేల్చాల్సిందే . నిజంగా సాంప్రదాయ పొలిటికల్ లీడర్ల మాదిరిగా పవన్ కూడా తను అనుకున్నవి చెప్పి సమావేశం ముగించినా.. చేసేదేమీ లేదు. కానీ.. ఈ విషయంలో మాత్రం తోపు లీడర్ల కంటే పవనే బెటర్ కదా? అంటున్నారు జర్నలిస్టు మిత్రులు.

 

ఇట్లు 

బలరామ్ ఎలకొండ

(* రచయిత సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్.),

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos