ఏపీలో పీక్స్‌కు చేరిన కులపిచ్చి: కమ్మ, రెడ్డి వర్గాల్లో అసహనం!

ఏపీలో పీక్స్‌కు చేరిన కులపిచ్చి: కమ్మ, రెడ్డి వర్గాల్లో అసహనం!

చంద్రబాబునాయుడిని ఎవరైనా విమర్శిస్తే కమ్మవారు భగ్గుమని మండిపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా తప్పుబడితే రెడ్లు నిప్పులు చెరుగుతున్నారు. ఆ మధ్య 'అసహనం' అనే మాట దేశాన్ని పట్టికుదిపేసిన సంగతి తెలిసిందే. ముస్లిమ్, దళిత వర్గాలపై సంఘ్ పరివార్ హిందూత్వ శక్తులు దాడులకు పాల్పడటాన్ని మత అసహనంగా విపక్షాలు, ప్రజాసంఘాలు అభివర్ణించాయి. ఇప్పుడు ఏపీలో అలాంటి అసహనమే తీవ్రంగా నెలకొనిఉంది... కమ్మ, రెడ్డి సామాజికవర్గాలలో. వారి వారి కులాలకు చెందిన పార్టీలపై, తమ కులపార్టీ అధినేతపై ఎవరైనా విమర్శలు చేస్తే లేశమైనా తాళలేకపోతున్నారు… విమర్శకులను దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ రెండు వర్గాలలో నూటికి 90 మంది ఇలాగే మాట్లాడుతున్నారు… వ్యవహరిస్తున్నారు. పరస్పర భౌతికదాడులకైతే పాల్పడటంలేదుగానీ ఆ రెండు సామాజికవర్గాలమధ్య సోషల్ మీడియాలో పానిపట్టుయుద్ధం, తళ్ళికోటయుద్ధం స్థాయిలో పరస్పరదాడులు జరుగుతున్నాయి.  తీవ్ర అసహనంతో రగిలిపోతున్న ఈ రెండు సామాజికవర్గాల వైఖరిని ఒకసారి పరిశీలిద్దాం.

 

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావటం ఏపీ ప్రజల అదృష్టమని, ఆయన తప్పితే రాష్ట్రాన్ని మరెవరూ కాపాడలేరని, పాలించలేరని కమ్మవారు అంటున్నారు. నిద్రాహారాలు మాని చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి నిర్విరామంగా కృషిచేస్తుంటే ఆయనపై విమర్శలు చేసేవారికి పుట్టగతులుండవని శాపనార్థాలు పెడుతున్నారు. విచిత్రమేమిటంటే, ఇలా శాపనార్థాలు పెట్టేవారిలో ఉన్నతవిద్యావంతులు, వృత్తినిపుణులు కూడా ఉండటం. చంద్రబాబు నాయుడు పాలనలోని ఒక్క లోపం కూడా వీరికి కనిపించదు.... దేవతావస్త్రాల కథలోలాగా. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోవటం, వైసీపీనుంచి పెద్దఎత్తున ఎమ్మెల్యేలను లాక్కోవటం, ప్రత్యేకహోదాపై పలుదఫాలు మాట మార్చటం వంటివన్నీ వీరికి తప్పులులాగా కనిపించవు. వీరిలో ఒక ప్రత్యేకవర్గం ఉంది. వీరు సోషల్ మీడియాలో తటస్థులలాగా బిల్డప్ ఇస్తూ ఉంటారు…  టీడీపీని విమర్శించే ప్రతివారిని మాత్రం నానాతిట్లూ తిడుతూఉంటారు. ఇక రెడ్డి సామాజికవర్గంవారి విషయానికొస్తే వారు జగన్ పై ఈగ వాలనీయటంలేదు. ఆయనను ఒక్కమాట అన్నా నిప్పులు చెరుగుతున్నారు. జగన్ ను అమాయకుడిని చేసి కేసుల్లో ఇరికించారని, చంద్రబాబు, సోనియాగాంధి కలిసిపోయి పన్నిన కుట్ర ఫలితమే సీబీఐ కేసులని అంటున్నారు(జగన్ తో సహా వైసీపీ వారందరూ చెప్పే వాదన ఇది). అపర భగీరథుడు, మహానేత అయిన వైఎస్ పాలన స్వర్ణయుగమని, అలాంటి పాలన మళ్ళీ కావాలంటే జగన్ రావాల్సిందేనని చెప్పుకొస్తున్నారు. జగన్ పై కేసుల విషయం ప్రస్తావనకొస్తే, అవన్నీ బనాయించిన కేసులేనని కొందరు రెడ్లు, అవినీతి ఎవరు చేయటంలేదని మరికొందరు రెడ్లు వాదిస్తుంటారు. జగన్ ఆస్తులు 2004-2009 మధ్య ఐదేళ్ళకాలంలో ఒక్కసారిగా వందల, వేల రెట్లు ఎలా పెరిగాయన్నదానిగురించి మాత్రం మాట్లాడరు.

 

మరోవైపు ఈ రెండు సామాజికవర్గాలకు చెందిన కుల సంఘాలు కూడా తమతమ వర్గాల వారిని విపరీతంగా రెచ్చగొడుతున్నాయి. గుంటూరుజిల్లాలో కమ్మ సామాజికవర్గంవారి ఒక కులసమావేశంలో సాక్షాత్తూ మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో శ్రీనివాసచౌదరి ఒక వ్యక్తి మాట్లాడుతూ కమ్మవారు ఎవరికిపడితే వారికి రక్తదానం చేయగూడదని, ఎవరినుంచిబడితే వారినుంచి రక్తం తీసుకోగూడదని పిలుపునివ్వటం ఒక పరాకాష్ఠగా చెప్పుకోవాలి. కమ్మవారిది ప్రత్యేకమైన జాతి అని, ఈ కులం రక్తం ఎవరితో కలవగూడదని ఆయన అభిప్రాయం. ఆయన ప్రసంగాన్ని కింది వీడియోలో చూడొచ్చు. మరోవైపు, హీరో బాలకృష్ణ ఆమధ్య, రాజకీయాలు అందరూ చేయలేరని, తమలాంటివారికే అది చెల్లుతుందని, తమ బ్లడ్డే వేరని చేసిన వ్యాఖ్యలుకూడా శ్రీనివాసచౌదరి వ్యాఖ్యలను సమర్థించేవిగా ఉన్నాయి. బాలయ్య వ్యాఖ్యలపై ప్రజాసంఘాల నాయకులు, హేతువాదులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరి 'అన్న తెలుగుదేశం' పార్టీ పెట్టి అభాసుపాలయిన నందమూరి హరికృష్ణది ఏమి బ్లడ్ అంటూ ఎదురుప్రశ్నలు సంధించారు. ఇదిలాఉంటే ఇటీవల కొందరు ఎన్ఆర్ఐలు కమ్మ జాతీయగీతం తయారుచేసి వదిలారు. దీనిలో వివిధ రంగాలలో అగ్రస్థానానికి చేరుకున్న కమ్మవారిని చూపుతూ కమ్మభక్తిని రగిల్చేలా పాటను రూపొందించారు. అయితే కమ్మవారుకాని సత్యనాదెళ్ళ, సింధులను కూడా దానిలో చేర్చారని దీనిని కొందరు ఎద్దేవా చేశారు.

కమ్మ కులనాయకుడి ప్రసంగం ఇక్కడ చూడండి 

 

కమ్మ జాతీయగీతాన్ని ఇక్కడ చూడండి

 

 

ఇక రెడ్డి సామాజికవర్గంవారి ఒక కులసమావేశంలో పొద్దుటూరు ఎల్లారెడ్డి అనే ఒక ఔత్సాహికుడు నిలువెల్లా ఊగిపోతూ చేసిన ప్రసంగంకూడా వారిలో కులభక్తిని తారాస్థాయికి తీసుకెళ్ళేలాఉందని చెప్పాలి. రెడ్లు పాలించటానికే పుట్టారని, ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు రెడ్ల సామ్రాజ్యమని ఆయన వాక్రుచ్చారు. రెడ్లు తమతమ వ్యాపారాలలో, పరిశ్రమల్లో రెడ్లనే ఉద్యోగాలలో పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. విభజన తర్వాత అసలే రెడ్ల జనాభాశాతం తగ్గిపోతే, రెడ్లను మరింత బలహీనం చేయటానికి ఈ ప్రభుత్వాలు కుట్రచేస్తున్నాయని ఆరోపించారు. నలుగురు తప్పిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించిన ముఖ్యమంత్రులందరూ తమ రెడ్లేనని చెప్పారు. తాము శూద్రులంకాదు, క్షత్రియులమని, ఈ పాలకులు అది గుర్తుపెట్టుకోవాలంటూ హెచ్చరిక చేశారు. ఆయన ప్రసంగాన్ని కింది వీడియోలో చూడండి.

 

రెడ్డి కులనాయకుడి ప్రసంగం ఇక్కడ చూడండి -

 

కమ్మ, రెడ్డి సామాజికవర్గాలలో ఈ అసహనం పెరగటానికి కారణం రాష్ట్ర విభజన తర్వాత ఈ రెండు సామాజికవర్గాలకూ రాజకీయప్రాబల్యం తగ్గటం అనే వాదన ఒకటి వినిపిస్తోంది… ముఖ్యంగా రెడ్లు. రెడ్లు గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా కీలక స్థానాలలో ఉండేవారు. అయితే విభజన తర్వాత వారి పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలలోగానీ, జాతీయస్థాయిలోగానీ ఎక్కడా కీలకపదవులు(కనీసం ఉపముఖ్యమంత్రి, స్పీకర్ వంటివికూడా) దక్కలేదు. పైగా తెలంగాణలో కేసీఆర్ రెడ్లను అణచటానికి ప్రయత్నిస్తున్నారన్న వాదన ఉండనే ఉంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేజిక్కించుకుంటాని ఊహించుకుంటే, నిరాశే మిగిలింది. దీనితో వారిలో అభద్రతాభావం నెలకొందని అంటున్నారు. ఇక కమ్మవారిని చూస్తే వారి పార్టీ టీడీపీకి మొదటినుంచీ బీసీలే బలం అన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో అత్యధికశాతంఉన్న బీసీలు టీడీపీకి పెట్టని కోటగా ఉండేవారు. విభజన తర్వాత ఆ బీసీల ఓట్ బ్యాంక్ అంతా టీడీపీ కోల్పోయినట్లయింది. అందుకే 2014 ఎన్నికల్లో చంద్రబాబే మెరుగైన అభ్యర్థి అయినప్పటికీ, ఎన్ని హామీలు గుప్పించినప్పటికీ అతి కొద్ది శాతం ఓట్ల ఆధిక్యతతో టీడీపీ గట్టెక్కింది. వారికి దేశవ్యాప్తంగా ఉన్న మోడిహవా, పవన్ మద్దతు లేకపోతే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవారనటంలో ఎటువంటి సందేహం అక్కరలేదు.

 

ఇదిలాఉంటే శాస్త్రీయదృక్పథంనుంచి చూస్తే ఈ కులోన్మాదాన్ని శుద్ధ అజ్ఞానంగా చెప్పుకోవాలని హేతువాదులు, శాస్త్రజ్ఞులు అంటున్నారు. అందరం ఒక తల్లినుంచి పుట్టినవారమని సౌభ్రాతృత్వం పెంచుకోవాల్సిందిపోయి కక్షలు, కార్పణ్యాలు పెంచుకోవటం ప్రకృతి విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారివాదనలో నిజంలేకపోలేదు. డీఎన్ఏపై  జరిగిన పరిశోధనల్లో నాలుగువేల సంవత్సరాలక్రితంవరకు మనిషి జీన్స్ అన్నిరకాల జాతుల, ప్రాంతాల మిశ్రమంగా ఉండేవని తేలింది. అంటే ఆఫ్రికా, యూరప్, ఆసియా ప్రాంత వాసుల జీన్స్ కూడా నాలుగుసంవత్సరాలక్రితంవరకు భారతదేశంలోని మనుషుల్లో కనిపించేవి. కానీ రెండువేల సంవత్సరాలనుంచి ఈ పరిస్థితి మారిపోయినట్లు కనుగొన్నారు. దీనికి కారణం భారతదేశంలో ప్రబలంగా వ్యాప్తిచెందిన కులవ్యవస్థేనని చెబుతున్నారు. కులవ్యవస్థ వలన, ఒకే కులానికి చెందినవారు మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకోవటంవలన ఆ మనుషుల జీన్ పూల్ బలహీనమవుతోందని శాస్త్రజ్ఞుల వాదన. ఇలా ఒకే కులంలోనివారు, ఒకే కుదరులోని వారు పెళ్ళిళ్ళు చేసుకోవటాన్ని 'సోషల్ ఇన్ సెస్ట్'గా వారు పిలుస్తున్నారు తమ తమ కులాలనుంచి, తమతమ కుదురులనుంచి కాకుండా ఎంత దూరంగా పెళ్ళిళ్ళు చేసుకుంటే పుట్టే పిల్లలు శారీరకంగా, మానసికంగా అంత బలంగా పుడతారని శాస్త్రజ్ఞలు సూచిస్తున్నారు యూరప్ దేశాలలోవారికంటే ఆసియాలో మనుషుల సగటు ఎత్తు, శరీరనిర్మాణం తక్కువగా ఉండటానికి కారణం 'సోషల్ ఇన్ సెస్ట్' అని శాస్త్రజ్ఞులు తేల్చారు.

 

కాబట్టి శాస్త్రీయదృక్పథంనుంచి చూస్తే - ప్రస్తుతం కులాలకోసం కొట్టుకుంటున్న ఈ వ్యవస్థ రెండువేల సంవత్సరాలకు ముందు అన్ని కులాలు, జాతులతో సంకరమైపోయి కులహీనమైపోయిఉన్నట్లు అర్థమవుతుంది. మరి అలాంటప్పుడు 'దానవీరశూరకర్ణ'లో ఎన్టీఆర్ చెప్పినట్లు, ఈ కులవ్యవస్థ ఏనాడో కులహీనమైపోగా, దానిగురించి ఈనాడు వ్యర్థ వాదనలెందుకు అనిపించకమానదు. శాస్తజ్ఞులు, హేతువాదులు చెప్పినట్లు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటేనే కులరహిత సమాజం వస్తుందని ఆశిద్దాం. ఇప్పటికే చాలా కులాల్లో ఆడపిల్లలు దొరక్క వేరే కులాలనుంచి, మతాలనుంచి పెళ్ళిళ్ళు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదీ ఒకందుకు మంచిదేనేమో!

 

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos