హైదరాబాద్: పచ్చమీడియా రాతలకు హద్దులేకుండా పోతోందంటూ పలు మీడియా సంస్థలపై  వైఎస్సార్‌సిపి నాయకులు సి రామచంద్రయ్య విరుచుకుపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసత్య వార్తలు రాస్తున్నారని ఆరోపించారు. తెలుగురాష్ట్రాలలో కుల,వర్గ వైషమ్యాలు పెరగడానికి కారణం ఈ  పచ్చమీడియానే అంటూ ఆయన ద్వజమెత్తారు.

అయితే ఈ వ్యాఖ్యలు అన్ని మీడియా సంస్థలకు వర్తించదవని... ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో అలాంటి మీడియా సంస్థల గురించే తాను మాట్లాడుతున్నానని అన్నారు. అలా ఎవరు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికి తెలుసని రామచంద్రయ్య అన్నారు.

 వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై ప్రజలలో అయిష్టత ఏర్పరచడానికే ఈ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కాకముందే ప్రతిరోజు ఇలా విషం గక్కడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 2007–14 మధ్యన మీడియాపై చర్యతీసుకున్న సంఘటనలు ఏమీ జరగలేదన్నారు.

ఎర్రచందనంకు సంబంధించి  18 మంది ఎన్‌ కౌంటర్లలో చనిపోయారు. దానిపై స్పందించారా? మానవహక్కుల హననం జరిగిందని రాశారా?  దీనిపై అయినా స్పందిచారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.  టిడిపివాళ్లు బేస్‌ లెస్‌ గా మానవహక్కుల గురించి ఫిర్యాదు ఇస్తే దానిని పెద్దగా చిత్రీకరించి వారి పత్రికలలో రాశారని ఆరోపించారు.

గోదావరి పుష్కరాలలో 29 మంది చనిపోతే చంద్రబాబు అక్కడే ఉండి ప్రజలందరూ పూజలు చేసుకుని వెళ్లేలా చూశారని ఈ పచ్చమీడియా తప్పుడు వార్తలు రాసిందన్నారు. మరి 29 మంది చనిపోవడానికి కారణం ఎవరనేది రాశారా?  ప్రశ్నించారు. 23 మంది ఎంఎల్‌ఏలు పార్టీ ఫిరాయిస్తే ఇదే పచ్చమీడియా రాశారా? మీకు రాయాలని అనిపించలేదా?వారిలో నలుగుర్ని మంత్రులను చేస్తే తప్పని రాయలేకపోయారని పేర్కొన్నారు.

ఓటుకు నోటు కేసు లో చంద్రబాబు తప్పు ఎత్తిచూపారా? –ఆర్ధికంగా చాలా కష్టాలలో రాష్ట్రం ఉంటే ప్రైవేటు విమానాలలో ప్రపంచం అంతా తిరిగుతూ చంద్రబాబు దుబారా చేస్తుంటే ఇది కరెక్ట్‌ కాదని చెప్పగలిగారా? చంద్రబాబు నిర్వహించిన భాగస్వామ్య సదస్సులు బోగస్‌ అని చెప్పగలిగారా?  కాల్‌ మనీ కేసులో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో రాయగలిగారా?  అంటూ ప్రశ్నించారు.

 రాజధానిలో రైతుల భూములు కొనే సమయంలో ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ జరిగితే ఎందుకు రాయలేకపోయారన్నారు. ఐదేళ్లు భజన చేసినందుకు మీకు వచ్చింది ఏంటి?
 అసెంబ్లీ లైవ్‌ కవరేజ్‌ హక్కులను సంపాదించుకున్నారు. మీరు చెప్పిన వారికి పార్టీ టిక్కెట్లు ఇప్పించే పరిస్దితి తెచ్చుకున్నారే ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అని పచ్చమీడియాను ప్రశ్నించారు.

 జగన్‌  గురించి చాలా చెడ్డగా రాసినా ఆయన ఇమేజ్ ను ఏమాత్రం డామేజ్‌ చేయలేకపోయారు. ప్రజల అభిమానం లేకే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని గుర్తించాలన్నారు. ప్రజాభిమానాన్ని పొందిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు గెలిపించారని  గుర్తుంచుకోవాలన్నారు. 

 ఓ పత్రిక వల్ల తాము ఓడిపోయామని కొందరు టిడిపి నేతలు చెబుతున్నారని అన్నారు. వాస్తవాలు వేరు ఎల్లోమీడియా కథనాలు వేరుగా వుంటాయని పేర్కొన్నారు. తప్పుడు కథనాలను ప్రజలు నమ్మలేదన్నారు.

మీకు నచ్చిన వ్యక్తిని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు జర్నలిజం విలువలను తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. అయితే చివరకి ప్రజాస్వామ్యమే గెలిచిందని తెలిపారు. వైఎస్ఆర్ కుటుంబం పట్ల అక్కసుతో చాలా నీచంగా రాసి చాలాపాపాలు చేశారని మండిపడ్డారు.

చంద్రబాబు తాను క్రియేట్‌ చేసుకున్న ప్రపంచంలో బతుకుతున్నారు. ఆ ప్రపంచం క్రియేట్‌ చేసుకుంటానికి చాలామందిని వాడుకున్నాడన్నారు. అదికారం శాశ్వతం అనుకుని ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు చిత్రీకరించి చూపించే ప్రయత్నం చేశారన్నారు. 47 డిగ్రీల ఎండకాస్తుంటే వెన్నల కాస్తుందని చల్లగా ఉందని మీరు రాస్తే ప్రజలు నమ్ముతారా?అది తెలుసుకోక ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారని పలు మీడియా సంస్థలపై విరుచుకుపడ్డారు.