కర్నూల్: జిల్లాలో అధికార వైసిపి పార్టీ నాయకులు రెచ్చిపోయారు. చిన్న టెండర్ దక్కించుకునేందుకు ప్రయత్నించిన వైసిపికి చెందిన రెండు వర్గాలు చివరకు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఇలా పట్టపగలే...నడిరోడ్డుపై..అదీ ప్రభుత్వ కార్యాలయంలోనే జరిగిన ఈ దాడులు నగరంలో ఉద్రిక్తత  పరిస్థితులకు కారణమయ్యాయి. 

కర్నూల్ పట్టణంలోని డీఈఓ కార్యాలయం వద్ద వైసిపి పార్టీకి చెందినటువంటి రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు సరఫరా చేసే కోడిగుడ్ల టెండర్ల కోసం వైసీపీ నేతల మధ్య ఘర్షణ తారా స్థాయికి చేరింది. రెండు వర్గాలుగా విడిపోయి ఘోరంగా కొట్టుకున్నారు.

డీఈవో కార్యాలయంలో కోడిగుడ్ల సరఫరాకు సంబంధించి...టెండర్ల హార్డ్ కాపీలను సమర్పిస్తున్న క్రమంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, డోన్ వైసీపీ యూత్ లీడర్ తమ్ముడు రాఘవేంద్ర గౌడ్ మద్య వాగ్వాదం ప్రారంభమైంది. అది కాస్త చిలికిచిలికి గాలివానలా మారి పెద్ద ఎత్తున ఘర్షణకు దారి తీసింది.

దీంతో సహనం కోల్పోయిన నేతలు వారి కార్యకర్తలు డిఈవో ఆఫీసులోనే పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. రాళ్ల దాడిలో డోన్ వైసీపీ యూత్ లీడర్ తమ్ముడు రాఘవేంద్ర గౌడ్, అతని డ్రైవర్ కు గాయాలు అయ్యాయి. ఈ ఘటన పట్టణంలో  తీవ్ర భయాందోళనకు దారితీసింది.

 డిఈఓ కార్యాలయానికి సమీపంలోనే మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ఉండడంతో  సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చి గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాలను అక్కడినుంచి పంపించేశారు. సంఘటనపై విచారణ జరిపి కేసులు నమోదు చేస్తామన్నారు పోలీసులు తెలిపారు.