వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా కర్నూల్ జిల్లా మహానంది మండల అధికారులు గ్రామాలబాట పట్టారు. గ్రామాల్లోని ప్రజలకు ఈ కంటి వెలుగు కార్యక్రమం గురించి వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. 

మహానంది మండలకేంద్రం తిమ్మాపురం గ్రామంలో కంటి వెలుగు పథకం గురుంచి ఎంపీడీఓ సుబ్బరాజు, ఈఓఆర్డీ మహాబూబ్ ఖాన్,డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్లు,ఆశ, కార్యకర్తలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. 

డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ... ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం వారి పిల్లలను స్కూల్ కు పంపాలని సూచించారు. పాఠశాలలో  10 వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని అన్నారు. 

రాష్టంలోని ప్రజలందరూ సమగ్ర కంటి పరీక్షలు,కళ్ళద్దాలు ఇతర కంటి వైద్యసేవలు ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగ సంజీవరావు, ఆరోగ్య మిత్ర చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.