తనకు నచ్చిన టీవీ ఛానల్ చూడనివ్వడం లేదని ఓ కొడుకు.. కన్న తండ్రిని అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... నాంపల్లి మండల కేంద్రానికి చెందిన పెరుమాళ్ల గోవర్దన్‌(65) ప్రకాశం బజార్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. అతడి కుమారుడు సతీష్‌ ప్రవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తండ్రి దగ్గర ఆరునెలలుగా ఉంటున్నాడు. గురువారం రాత్రి గోవర్దన్‌ టీవీలో భక్తిచానల్‌ చూస్తూ, అదేసమయంలో తన కుమారుడు సతీశ్‌ను జీతం డబ్బులు అడిగాడు.
 
సతీశ్ టీవీ చానల్‌ మార్చడానికి ప్రయత్నించగా, తండ్రి వారించాడు. దీంతో కోపోద్రికుడైన సతీశ్ టీవీని పగలగొట్టి గోవర్దన్‌ రోకలి బండతో దాడి చేసి హత మార్చాడు. మృతుడి భార్య 15 ఏళ్ల క్రితమే కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతుడి కుమార్తె జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేశ్ కుమార్ తెలిపారు.