అనంతపురం: తన వ్యక్తిగత సహాయకుడు దంపెట్ల నారాయణ(50) మృతిపట్ల ఏపి సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అండగా వుంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దిగువపల్లి గ్రామానికి చెందిన నారాయణ గురువారం అర్థరాత్రి మృతిచెందారు. దీంతో మృతదేహం శుక్రవారం స్వగ్రామానికి చేరుకుంది. అయితే ఇవాళ మధ్యాహ్నం 3:50 గంటలకు దిగువపల్లికి  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతితో కలిసి వచ్చి మృతదేహానికి నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా నారాయణ భార్య భవాని, కుమారుడు వెంకట సాయి కృష్ణ (22), కుమార్తె నిఖిత (20),  తల్లి సాలమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో ఇంటి లోపలికి పిలుచుకుని కాసేపు మాట్లాడారు. వారిని  ఓదార్చుతూ తాను మీ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.  మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని అధైర్య పడవద్దని వారిలో ధైర్యం నింపారు. 

సీఎం జగన్ వెంట వచ్చిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి శంకర్ నారాయణ,  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి,ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి,  ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, సిద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కలెక్టర్ గంధం చంద్రుడు, డిఐజి క్రాంతి రాణా టాటా, ఎస్పీ సత్య ఏసు బాబు,  తదితరులు కూడా నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు.