అతనితో బంధం ఆమెకు ఆనందాన్ని కలిగించింది. అతనితోనే జీవితాంతం గడపాలని ఆశపడింది. అందుకు భర్త అడ్డుగా ఉన్నాడని ఆమెకు అనిపించింది. అందుకే అతని అడ్డు తొలగించుకోవాలని భావించింది. ప్రియుడితో కలిసి పథకం వేసి మరీ దారుణంగా హత్య చేసింది. ఈ సంఘటన మద్దూరు మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... పాన్ గల్ మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు(40)కు చిన్నచింత కుంట మండలం మద్దూరు కి చెందిన రాములమ్మతో 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా.. కొన్ని సంవత్సరాలపాటు వీరు ఆనందంగానే ఉన్నారు. తర్వాత చిన్న చిన్న మనస్పర్థలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలో ఐదు సంవత్సరాల క్రితం రాములమ్మ భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లింది.

అక్కడ.. ఆమెకు సలీం అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ప్రియుడితో కలిసి జీవితాంతం ఉండాలంటే భర్త అడ్డు తొలగించుకోవాలని ఆమె భావించింది. అందులో భాగంగానే... ఈ నెల 23వ తేదీన భర్తకు ఫోన్ చేసి..  తనకు అనారోగ్యం సరిగా లేదని చెప్పింది. ఐదు సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నప్పటికీ..భార్యకు బాలేదు అనగానే అతను అత్తారింటికి బయలుదేరాడు.

అతను దారిలో ఉండగానే మాటు వేసి ప్రియుడు, తమ్ముడితో కలిసి రాములమ్మ భర్తను హత్య చేసింది. అనంతరం ఓ ప్రాంతంలో అతనిని పూడ్చిపెట్టారు. రెండు రోజుల తర్వాత ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా... అసలు నేరస్థులను దొరికిపోయారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.