ఇంట్లో వాళ్లు ఆమెకు ఆనందంగా పెళ్లి చేశారు. కానీ ఆమె వివాహ బంధానికి విలువ ఇవ్వలేదు. కట్టుకున్న భర్తను వదిలేసి.. మరో వ్యక్తితో సహజీవనం మొదలుపెట్టింది. కొంతకాలం వాళ్ల బంధం బాగానే సాగింది. ఆ తర్వాత ఆమె కోరుకున్న ప్రియుడే వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తికి దగ్గరయ్యింది. పాత ప్రియుడిని చంపేందుకు కొత్త ప్రియుడిని సహాయం తీసుకుంది. పథకం ప్రకారం వదలించుకుంది. ఈ సంఘటన  చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లా పుంగనూరుకి చెందిన మల్లికా భాను కి కొన్ని సంవత్సరాల క్రితం ఖాదర్ బాషాతో వివాహం జరిగింది. కాగా... పెళ్లి తర్వాత ఆమెకు షబ్బీర అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో... ఆమె భర్తను కాదని షబ్బీర్ తో సహజీవనం చేయడం మొదలుపెట్టింది. అయితే... షబ్బీర్ చెడు అలవాట్లకు బానిసగా మారి మల్లికా భానుని వేధించడం మొదలుపెట్టాడు.

తన జల్సాలకు డబ్బుల కోసం ఆమెను వ్యభిచారం చేయమని ఒత్తిడి చేసేవాడు. దీంతో మల్లికాభాను తన మరో ప్రియుడు షేక్‌ చాంద్‌బాషాతో కలిసి గత నెల 21న షబ్బీర్‌ను హత్య చేసింది. షబ్బీర్‌ తాగిన మైకంలో ఇంట్లో నిద్రిస్తుండగా మల్లికాభాను, చాంద్‌బాషా కలిసి లుంగీని మెడకు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని చాంద్‌బాషా బొలెరో జీపులో మండలంలోని కృష్ణాపురం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కొబ్బరిపీచు వేసి, పెట్రోల్‌ పోసి కాల్చివేశాడు. కృష్ణాపురం అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు గత నెల 29న పోలీసులకు సమాచారం రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకోగలిగారు. వారిని అరెస్టు చేసి విచారించగా... అసలు నిజం బయటపడింది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.