ప్రియుడితో కలిసి ఓ మహిళ భార్యను అతి కిరాతకంగా హత్య చేసింది. హత్య చేసి... అనంతరం దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. చివరకు పోలీసులు చిక్కారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం శివారు మంగల్‌కాలనీకి చెందిన ఇన్నారపు నవీన్‌కు(37), మల్యాల శివారు రేగడితండాకు చెందిన శాంతిలకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలంపాటు సజావుగా సాగిన వారి కాపురంలో చిన్నపాటి గొడవలు తలెత్తాయి. ఈ క్రమంలోనే మంగల్‌ కాలనీలోనే కూరగాయలువిక్రయించే దాసరి వెంకటేష్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. 

ఈ విషయం తెలుసుకున్న నవీన్‌ వారిద్దరిని హెచ్చరిస్తూ వచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో నవీన్ ని  అంతమందించాలని వెంకటేష్, శాంతిలు పథకం వేశారు.  సెప్టెంబర్‌ 21న రాత్రి రేగడితండాలోని తన తల్లిగారింటి వద్ద మటన్‌ ఉందని, తీసుకురావాలని శాంతి భర్త నవీన్‌కు చెప్పింది.
 
భార్య చెప్పినట్లుగా రేగడితండాకు బయల్దేరాడు. ఈ విషయాన్ని శాంతి వెంకటేష్‌కు సమాచారం అందించింది. వెంకటేష్‌ తన స్నేహితుడు బద్దం నవీన్‌తో కలసి రేగడి తండాకు వెళ్లేమార్గంలో కాపుకాశారు. ఇన్నారపు నవీన్‌ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఆపి వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్డుతో ఒక్కసారిగా తలపై దాడి చేశారు. అనంతరం పక్కనే ఉన్న గుట్టలోకి లాక్కెళ్లారు. అక్కడ అతడి మెడచుట్టూ టవల్‌ బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని రోడ్డుపై పడేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు.

అది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. పథకంలో భాగంగానే శాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న మహబూబాబాద్‌ రూరల్‌ సీఐ వెంకటరత్నం, కురవి ఎస్సై శంకర్‌రావు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన జరిగి తీరుపై అనుమానాలు తలెత్తడంతో హత్య జరిగి ఉంటుందా?.. అన్న కోణంలో విచారణ మొదలుపెట్టారు. మానుకోట నుంచి రేగడితండా వైపువెళ్లే సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు.

అందులో రాత్రి సమయంలో వెంకటేష్‌, బుద్దం నవీన్‌ కదిలికలను గుర్తించారు. అలాగే ఘటనకు ముందు.. తర్వాత వెంకటేష్-శాంతిల మధ్య జరిగిన కాల్‌ రికార్డు డేటాను పోలీసులు పరిశీలించారు. నిందితులు వారేనని నిర్ధారణకు వచ్చాకా అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో అరెస్ట్‌చేసినట్లు ఎస్పీ తెలిపారు.