పరిగి: గుట్టుగా మాటు వేసి ఓ మహిళ తన భర్త మరో మహిళతో కలిసి ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తన భర్త వివాహేతర సంబంధం గుట్టును రట్టు చేసింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి టీచర్స్ కాలనీలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. 

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామానికి చెందిన సతీష్ ఖమ్మంలోని స్వరాజ్ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్ గా పనిచేస్తూ ఉండేవాడు. అతనికి ఖమ్మంలోని భవానితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులున్నారు. 

సతీష్ కు ఏడాదిన్నర క్రితం కొత్తగూడెం బదిలీ అయింది. అక్కడ అతనికి ఓ మహిళతో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొద్ది రోజుల తర్వాత ఆ విషయం భార్యకు తెలిసింది. దీంతో ఇరువురి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. 

దాంతో అతను తన ఉద్యోగాన్ని వికారాబాద్ జిల్లా పరిగిలోని ఆఫీసుకు బదిలీ చేయించుకున్నాడు. కొంత కాలంగా పరిగిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. భార్యను మాత్రం కొత్తగూడెంలోనే ఉంచాడు. పరిగిలో ప్రేయసి కలిసి ఉంటున్నాడు. విషయాన్ని పసిగట్టిన భార్య గురువారం పరిగికి వచ్చింది. అతను అద్దెకు ఉంటున్న గదికి వెళ్లింది. 

తలుపు పెట్టి ఉండడంతో తీయాలని కోరింది. డోర్ తీయకపోవడంతో 100కు డయల్ చేసింది. దాంతో పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు తెరిపించారు. గదిలోంచి సతీష్ తో పాటు అతని ప్రేయసి కూడా బయటకు వచ్చింది. దాంతో సతీష్ భార్య ఆ మహిళ జట్టు పట్టుకుని కొట్టింది. ఇద్దరూ జట్లు పట్టుకుని కొట్టుకున్నారు. 

భార్య పోలీసులకు లిఖితపూర్వకమైన ఫిర్యాదు ఏదీ చేయలేదు. తన వెంట తన భర్త వస్తే చాలునని ఆ మహిళ చెప్పడంతో ముగ్గురిని కూడా పోలీసులు వదిలేశారు.