విజయవాడకు చెందిన ఓ  కుర్రాడు... మోడలింగ్ లో టాప్ రేంజ్ కి చేరుకున్నాడు. కేవలం 12ఏళ్ల కే ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. అక్కడితో ఆగలేదు... ర్యాంప్ నడిచి పోటీల్లో విజేతగా కూడా నిలిచాడు. ‘ టాప్ టీన్ అండ్ చైల్డ్ మోడల్ ఆఫ్ ది ప్లానెట్ 2019’ విజేతగా విజయవాడ కుర్రాడు తీర్థక్ భోగాది విజయం సాధించాడు.

విజయవాడకు చెందిన తీర్థక్ భోగాదికి చిన్నప్పటి నుంచి మోడలింగ్ పై ఆసక్తి ఎక్కువ. అతని ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు మోడలింగ్ లో శిక్షణ ఇప్పించారు. కాగా... ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు  జార్జియాలో జరిగిన పోటీల్లో తీర్థక్ పాల్గొన్నాడు. దీనిలో ఆసియా కాంటినెంట్ విభాగం నుంచి పోటీచేసి టైటిల్ సాధించాడు.

బాలబాలికలు, టీనేజర్లకు నిర్వహించే ఈ పోటీల్లో ఆతిథ్య జార్జియాతోపాటు భారత్,థాయ్ లాండ్, దక్షిణాఫ్రికా, మాల్టా, రొమేనియా, గ్రీస్, ఉక్రెయిన్ కి చెందిన చిన్నారులు పాల్గొన్నారు. నాలుగు( మినీ, చైల్డ్, ప్రీ టీన్, టీన్) విభాగాల్లో  పోటీ నిర్వహించగా.. తీర్థక్ ప్రీ టీన్ ఈవెంట్ లో విజేతగా నిలిచాడు. తీర్థక్ విజయవాడలోని నలంద విద్యానికేతన్ లో ఏడో తరగతి చదువుతున్నాడు.  ముంబయికి చెందిన డీ లా వాలంటీనా మోడలింగ్ సంస్థ డైరెక్టర్ స్కూల్లో నిర్వహించిన ఈవెంట్లలో అతని ప్రతిభ చూసి ఈ మోడలింగ్ పోటీలకు ఎపింక చేశారు.