జనగామ జిల్లాలో దారుణం జరిగింది. భర్తపై దాడి చేసిన దుండగులు అతని భార్యను కిడ్నాప్ చేశారు. వివరాల్లోకి వెళితే.. జనగామకు చెందిన  బండ తిరుపతి, భాగ్యలక్ష్మీ దంపతులు ఆదివారం ఉదయం జనగామ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం, పారపల్లి గ్రామానికి బైక్‌పై వెళుతున్నారు.

ఈ క్రమంలో రాంపల్లి సమీపంలో వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను కారుతో ఢీకొట్టిన దుండగులు తిరుపతిని చితక్కొట్టి ఆయన భార్యను అపహరించుకుపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి స్పృహ తప్పిపడిపోయిన తిరుపతిని స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితుడి నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆస్తి తగాదాల కారణంగానే ఈ కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.