కర్నూల్: దసరా సెలవుల కోసం ఇంటికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా మారారు.  తల్లితోపాటు బట్టలు ఉతికేందుకు వెళ్ళి సరదాగా ఈతకొడుతూ ఇద్దరు అక్కాచెల్లెల్లు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. తల్లి ఏమరుపాటుగా ఉండడంతో నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగిపోయారు. 

మదనపల్లె పట్టణం రామారావుకాలనీకి చెందిన రజియా తన ముగ్గురు కుమార్తెలను వెంటబెట్టుకుని బట్టలుతికేందుకు సమీపంలోని తట్టివారిపల్లె  చెరువుకు వెళ్ళింది. బట్టలు ఉతుకుతుండగా..ఇద్దరు కుమార్తెలు  షమీరా(10), ఆసీఫా(09) లు చెరువులో ఈత కొడుతూ ఆడుకుంటున్నారు. అయితే అలా సరదాగా ఈతకొడుతూ లోతట్టులోకి వెళ్ళారు. 

ఈ విషయాన్ని గమనించకుండా తల్లి రజియా బట్టలు ఉతుక్కుంటూ ఉండిపోయింది. నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు పిల్లలు నీట మునిగిపోయారు. పిల్లలిద్దరూ కనబడకుండా పోయేసరికి తల్లి రజియా గట్టిగా కేకలు వేశారు. దీంతో స్తానికులు అక్కడికి చేరుకుని చెరువు లో మునిగి మృతి చెందిన ఇద్దరు చిన్నారులను వెలికి తీశారు. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అక్కాచెల్లెల్ల మృతి ఘటన స్థానికులను కలచి వేసింది.